Actress Pakeezah: మీ కాళ్లు పట్టుకుంటా ఆదుకోండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న సీనియర్ నటి వీడియో

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:21 PM

ఇప్పుడంటే స్టార్ హీరోయిన్లు, నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కెబెట్టుకుంటున్నారు.

Pakeezah

Actress Pakeezah: ఇప్పుడంటే స్టార్ హీరోయిన్లు, నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కెబెట్టుకుంటున్నారు. ఎందుకంటే అవకాశాలు రానప్పుడు, చివరి అంకంలో ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి తెలివిగా ఆలోచిస్తూ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం, వేరే వేరే వ్యాపారాలు చేయడం చేస్తున్నారు. కానీ, అప్పట్లో నటీమణులకు అంత తెలివి లేదు. అందుకే ఇప్పుడు చాలామంది నటీమణులు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి నటీమణుల్లో పాకీజా (Actress Pakeezah) ఒకరు. పాకీజా.. ఇప్పటి జనరేషన్ కు ఆమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఆమె నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు.


1986 లో ఎన్ ఊయిర్ కన్నమ్మ అనే సినిమాతో పాకీజా ఇండస్ట్రీకి పరిచయమైంది. లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక తెలుగులో ఆమెను మోహన్ బాబు పరిచయం చేశాడు. బ్రహ్మానందం - కోవై సరళ జంట అంటే ప్రేక్షకులకు ఎంత ఇష్టమో అందరికీ తెల్సిందే. కానీ, కోవై సరళ కన్నా ముందే బ్రహ్మానందంతో మంచి పెయిర్ అనిపించుకున్న నాటికి పాకీజా. రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, పెదరాయుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంది.


ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె సినిమాల నుంచి వైదొలగింది. తమిళ్ లోనే అప్పుడప్పుడు వెండితెరపై, బుల్లితెరపై కనిపిస్తూవచ్చింది. ఇక కొన్ని నెలల క్రితం.. ఒక తెలుగు ఛానెల్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ సమయంలో తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అవకాశాలు ఏవైనా వస్తే కొంచెం బావుంటుందని తెలిపింది. ఇక తాజాగా మరోసారి పాకీజా తన ఆవేదనను బయటపెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆమె వేడుకుంది. తనను ఆదుకోవాలని కోరుతూ కంటనీరు పెట్టుకుంది.


'ఏపీ సీఎం చంద్రబాబుగారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేనే పాకీజామ్మ. కామెడీ యాక్టర్. నేను చాలా కష్టాల్లో ఉన్నా. మూడేళ్లుగా సినిమాలు, షూటింగ్లు లేవు. అన్నీ వదిలేసి చెన్నై నుంచి నా సొంతూరికి వచ్చేశాను. చాలా కష్టాల్లో ఉన్నాను. రెండు సార్లు విజయవాడ వచ్చా. కానీ సీఎం, డిప్యూటీ సీఎంను కలవలేకపోయాను. మీ కాళ్లు పట్టుకుంటా. నన్ను ఆదుకోండి. నాకు తమిళనాడులో నాకు ఆధార్ ఉంది. నెలకు నెల నాకు పెన్షన్ వచ్చినట్లు ఏదో ఒక సహాయం చేయండి. పిల్లలు, భర్త లేరు. AP తరఫున ఏదైనా సహాయం చేయండి' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పాకీజాను ఆదుకోవాలని నెటిజన్స్ సైతం ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 04:21 PM