Bhatti Vikramarka: ఏయన్నాఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు..
ABN, Publish Date - Nov 22 , 2025 | 02:44 PM
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విభాగాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ఏయన్నార్‌ను గుర్తుచేసుకున్నారు.
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విభాగాన్ని (Annapurna Film college) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ఏయన్నార్‌ను గుర్తుచేసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడెంట్స్ ప్రతిభ, సృజనాత్మకతను ప్రశంసించారు.
ఆయన మాట్లాడుతూ ‘1970లలో ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో స్థాపించడం ఒక అద్భుతమైన ఆలోచన. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎదిగింది. అక్కినేని చూపించిన దారిలో ఆయన ఆశయాలను, అన్నపూర్ణ కాలేజ్‌ను ప్రపంచ స్థాయి సినిమా విద్యాసంస్థగా నిలబెట్టడడానికి నాగార్జున, అమల కృషి చేస్తున్నారు. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన ‘రోల్ నం.52’ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది’ అని ప్రశంసలు కురిపించారు.
‘2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్థి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మిషన్‌లో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషించనుంది. అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున ఇతర నటుల మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించినప్పుడు నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో భారత్‌లోనే అత్యుత్తమ కళాశాలలో ఒకటిగా అన్నపూర్ణ స్కూల్ ఉంది. భట్టి విక్రమార్క ఈ కళాశాలను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.