NTR: వార్ 2 హక్కులు సితారకే...

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:53 AM

ఎట్టకేలకు వార్ -2 హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా నిర్మించిన ఆయన, ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' పంపిణీ హక్కుల్ని పొందారు. ఇప్పుడు 'వార్ -2'నూ ఆయనే తెలుగులో విడుదల చేయబోతున్నారు.

అనుకున్నట్టుగానే అయ్యింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) మొత్తానికీ 'వార్ 2' (War -2) తెలుగు హక్కుల్ని పొందారు. గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా... ఆయన మాత్రం వ్యూహాత్మక మౌనం వహించారు. ఈ రోజు మంచి రోజు కావడంతో బహుశా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించి ఉండొచ్చు.


ఎన్టీయార్ ను ప్రేమగా అన్నా అని పిలుస్తారు సూర్యదేవర నాగవంశీ. యంగ్ టైగర్ ఎన్టీయార్ (NTR) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్ లో నాగవంశీ 'అరవింద సమేత' మూవీని నిర్మించారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' మూవీలో నటించారు. ఆపై చాలా కాలం గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా 'దేవర' మూవీని చేశారు. ఈ సినిమా విడుదల హక్కుల్ని సూర్యదేవర నాగవంశీనే పొందారు. ఈ సినిమా కూడా చక్కని విజయాన్ని అందుకుంది. దాంతో హ్యాట్రిక్ మీద కన్నేసిన నాగవంశీ ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన 'వార్ -2' తెలుగు హక్కుల్ని భారీ మొత్తానికి తీసుకున్నట్టు తెలిసింది. నైజాంలో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ కు నాగవంశీ ఇచ్చారు. 'అరవింద సమేత, దేవర' తర్వాత 'వార్ -2'తో హ్యాటిక్ కొడతామనే ధీమాను వ్యక్తం చేస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ వీడియోను శనివారం విడుదల చేసింది.

హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'వార్ -2' ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత కార్తికేయుడి కథ ఆధారంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సూర్యదేవర నాగవంశీ ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం చేయబోతున్నాడు. మరి యంగ్ డైరెక్టర్ నాగవంశీ హ్యాట్రిక్ కోరిక 'వార్ -2'తో నెరవేరుతుందో లేదో చూడాలి.

Also Read: Mega Star: చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే...

Also Read: Kollywood: పూజా కిట్ లో మరో తమిళ మూవీ

Updated Date - Jul 05 , 2025 | 12:01 PM