ఇష్టం లేకుంటే సినిమా చూడకండి
ABN, Publish Date - Jun 18 , 2025 | 03:07 AM
కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌ను కర్ణాటకలో నిషేధించడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు...
థగ్‌లైఫ్ వివాదంపై సుప్రీం కోర్ట్
కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌ను కర్ణాటకలో నిషేధించడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం మంగళవారం విచారించింది. కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సినిమా విడుదలను అడ్డుకోవడం ఏమిటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాను విడుదల చేయొద్దని బెదిరించడం సరికాదని, ఇష్టం లేకుంటే సినిమాను చూడకండి అని సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) గుర్తింపు ఉన్న ఏ సినిమానైనా రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు అనుమతించాలనే నిబంధన ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సినిమాను ప్రదర్శించేలా చూడాలని సూచించింది. ప్రజలు సినిమా చూస్తారా, చూడరా అన్నది వేరే విషయమని అన్నారు. ప్రజలు సినిమాను తప్పనిసరిగా చూడాలని తాము ఆదేశాలు ఇవ్వడం లేదని, కానీ సినిమాను విడుదల చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కోర్టు పనికాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)