Tollywood: పెద్దలకు మాత్రమే 'ఎర్రచీర'
ABN, Publish Date - Oct 10 , 2025 | 03:25 PM
సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన సినిమా 'ఎర్రచీర'. ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ లభించింది. డివోషనల్ టచ్ ఉన్న 'ఎర్రచీర' చిత్రాన్ని కార్తీక మాసంలో విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.
ప్రముఖ నటుడు రాజేంద ప్రసాద్ (Rajendra Prasad) మనవరాలు బేబీ సాయి తేజస్విని (Sai Tejaswini) కీలక పాత్ర పోషించిన సినిమా 'ఎర్రచీర' (Erracheera). సుమన్ బాబు (Suman Babu) దర్శకత్వం వహిస్తూ ఓ కీలక పాత్రను ఇందులో పోషించారు. బేబీ డమరి సమర్పణలో ఎన్. వి. వి. సుబ్బారెడ్డి (సుభాష్), సిహెచ్. సుమన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ లభించింది.
దీని గురించి సుమన్ బాబు చెబుతూ, 'తల్లీకూతుళ్ళకు సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. అయితే హారర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా సి.బి.ఎఫ్.సి. మెంబర్స్ మా సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే హృద్రోగులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాకు వస్తే మంచిది' అని అన్నారు. మరో నిర్మాత ఎన్.వి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 'సినిమా కంటెంట్ లో డివోషనల్ టచ్ బాగా ఉంది. అందుకనే ఈ సినిమాను ముందు అనుకున్నట్టుగా 10వ తేదీన కాకుండా కార్తీక మాసంలో అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నాం. ఇందులోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయి' అని చెప్పారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ స్థాయిలో బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకున్న నందు ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రమోద్ పులిగార్ల స్వరాలు సమకూర్చగా, ఎస్. చిన్న నేపథ్య సంగీతం అందించారు.
Also Read: Ari Movie Review: అరి మూవీ రివ్యూ
Also Read: Kishkindhapuri OTT: ఓటీటీకి.. లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ కిష్కిందపురి!. కానీ ఫస్ట్ అక్కడే