Sujeeth: ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంలో ఉండగానే..
ABN, Publish Date - Sep 22 , 2025 | 06:07 PM
నలబై షార్ట్ ఫిల్మ్స్ చేశాక.. ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు సుజీత్. తన తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో సూపర్‌హిట్ అందుకున్నారు. తదుపరి రెండో చిత్రానికే ప్రభాస్‌తో సాహో చిత్రం అవకాశం వచ్చింది. ఇక మూడో సినిమాకు పవన్‌కల్యాణ్‌నే డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు.
నలబై షార్ట్ ఫిల్మ్స్ చేశాక.. ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు సుజీత్. తన తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో సూపర్‌హిట్ అందుకున్నారు. తదుపరి రెండో చిత్రానికే ప్రభాస్‌తో సాహో చిత్రం అవకాశం వచ్చింది. ఇక మూడో సినిమాకు పవన్‌కల్యాణ్‌నే డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం ‘ఓజీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం పవన్ కల్యాణ్; ఓజీ, సుజీత్, తమన్ సంగీతం గురించే హల్‌చల్ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సుజీత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సుజీత్ చెప్పుకొచ్చారు.
బాధ, కోపం, కసి అన్నీ..
‘సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. అవకాశాల కోసం బాగా తిరుగుతున్న సమయంలో ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. ‘రన్ రాజా రన్’ కంటే ముందు నిర్మాతలకు వినిపించా. వాళ్లకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లూ ఆలోచించి మంచి వెర్షన్ రాశా. ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి సెకండాఫ్ వినిపించా. వాళ్లు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంతో బైక్‌పై బయలుదేరా. దార్లో ఉండగా ఫోన్ వచ్చింది. బండి పక్కన పెట్టి ఫోన్ తీఽశా. ‘చూడమ్మా ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు’ అన్నారు. ఒక్కసారిగా నీరసం నీరసం వచ్చేసింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్‌కు ఫోన్ చేశా. అతను కాస్త ధైౖర్యం ఇచ్చాడు. ‘నువ్వు షార్ట్ ఫిల్మ్ గంటలో రాయగలవు.. సినిమా ఒక రోజులో రాయలేవా?’ అని నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలు దేరదామని బండి స్టార్ట్ చేశా. పెట్రోల్ అయిపోయి స్టార్ట్ కాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. జోరున వాన. ఏం చేయాలో తెలియలేదు. జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకూ బండిని నెట్టుకుంటూ వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు... బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికి వచ్చి తల తుడుచుకున్నా.
అంతే ‘రన్ రాజా రన్’ కథ ఐడియా వచ్చింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి ‘సంవత్సరం నుంచి ఓ కథ రాస్తున్నా... చెప్పమంటారా?’ అని అడిగా. రేపు ఆఫీసుకు రా అన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది మూడు రోజుల్లో వస్తానని చెప్పి... ‘రన్ రాజా రాన్’ కథ మొత్తం రాసి తీసుకెళ్లా. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా... ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు... మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’’ అని సుజీత్ అన్నారు.