Fauzi: 'ఫౌజీ' యంగ్ ప్రభాస్‌గా.. సుధీర్ బాబు చిన్న కొడుకు!
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:05 PM
'ఫౌజీ' చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రను సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ చేస్తున్నాడు. గతంలో అతను 'గూఢచారి, సర్కారు వారి పాట' చిత్రాలలోనూ నటించాడు.
సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) చిన్నల్లుడు, మహేశ్ బాబు (Mahesh Babu) బావ సుధీర్ బాబు (Sudheer Babu) ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. కృష్ణ చిన్నకూతురు ప్రియదర్శిని భర్త అయిన సుధీర్ బాబు తన కొడుకులనూ సినిమా రంగంలోకే తీసుకొస్తుండటం విశేషం. ప్రియదర్శిని, సుధీర్ బాబు జంటకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి చరిత మానస్. ఇతను గతంలో 'భలే భలే మొగాడివోయ్' చిత్రంలో చిన్నప్పటి నాని (Nani) గా నటించాడు. అలానే చిన్న కొడుకు దర్శన్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 2018లో వచ్చిన 'గూఢచారి'లో చిన్నప్పటి అడివి శేష్ (Adivi Sesh) గానూ, 2022లో వచ్చిన 'సర్కారు వారి పాట'లో చిన్నప్పటి మహేశ్ బాబు గానూ దర్శన్ నటించాడు.

తాజాగా సుధీర్ బాబు తనయుడు దర్శన్ 'ఫౌజీ' (Fauzi) మూవీలో యంగ్ ప్రభాస్ గా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా అతని తండ్రి సుధీర్ బాబు తెలిపాడు. సుధీర్ బాబు నవంబర్ 7న విడుదల కాబోతున్న తన తాజా చిత్రం 'జటాధర' (Jatadhara) ప్రమోషన్స్ సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో భారీ సంస్కృత సంభాషణలు ఉన్నాయని, వాటిని చాలా సులువుగా, సునాయాసంగా దర్శన్ చెప్పేశాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. 'ఫౌజీ' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఫౌజీ'తో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Mega 158: మొన్న కార్తీ.. నేడు అనురాగ్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బాబీ
Also Read: Dacoit: అడివి శేష్ క్రిస్టమస్ వదిలేసి ఉగాది మీద పడ్డాడే