సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fish venkat: శ్రీహరి స్నేహితుడు.. వి.వి.వినాయక్‌ గాడ్‌ఫాదర్‌

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:46 AM

తొడకొట్టు చిన్నా.. తొడకొట్టు.. దద్దరిల్లిపోవాలా.. అంటూ ఆదిలో ఫైర్‌బ్రాండ్‌లా విరుచుకుపడ్డారు.. అమ్మా నాయనలను ఎట్టా సంపాడో తెలుసా.. అని రౌద్రాన్ని చూపించారు..

Fish Venkat alias manginapalli Venkatesh

'తొడకొట్టు చిన్నా.. తొడకొట్టు.. దద్దరిల్లిపోవాలా'.. అంటూ ‘ఆది’లో ఫైర్‌బ్రాండ్‌లా విరుచుకుపడ్డారు..(Fish Venkat)


'అమ్మా నాయనలను ఎట్టా సంపాడో తెలుసా'.. అని రౌద్రాన్ని చూపించారు..(Artist Fish venkat is no more)


'వాట్‌ ఆర్‌ యు టాకింగ్‌.. యువర్‌ జీనియస్‌ బ్రో..
అన్నా వాట్సాప్‌ అంటే తెలియదా.. వాట్‌ ద ఫ్రాక్‌..'

'అన్నా నువ్వు గాంధీ తాత లెక్క అందరికి పెదనాన్న అయిపోయావ్ అన్న' అంటూ వినోదాన్ని పంచారు..


'అన్నా నేను ఇంటికెళ్తా .. రోజు లేట్‌గా వస్తున్నా అని నా వైఫ్‌ గొడవ చేస్తోందన్నా' అని సైలెంట్‌  కామెడీ చేశారు..

ఈ వేరియేషన్స్‌ అన్నీ చూపించింది ఒక నటుడే. ఆయన ఫిష్‌ వెంకట్‌ అలియాస్‌  మంగిలపల్లి వెంకటేష్‌. డిఫరెంట్‌ డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజంతో ప్రేక్షకులను కట్టిపారేశారు. ఇప్పుడు ఆ శైలి, మ్యానరిజం నటనకు దూరమైంది. టాలీవుడ్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఫిష్‌ వెంకట్‌ (53) కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అన్నా.. ఇక  సెలవంటూ చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోయారు.

హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్‌ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేర్చారు. రెండు మూత్రపిండాలు మార్పిడి చేయాలని  వైద్యులు తెలిపారని ఇటీవల అతని కుమార్తె స్రవంతి మీడియాకు వెల్లడించింది. వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నామని దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం బాధాకరం.


వెంకట్‌ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్‌. ఆయన కుటుంబీకుల స్వస్థలం బందరు. అయితే ఫిష్‌ వెంటక్‌ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌, రామ్‌నగర్‌లోనే. గంగపుత్ర వర్గానికి చెందిన ఆయన కుల వృత్తిగా చేపల వ్యాపారం చేసేవారు. మొదట ఆయన్ను ఫిష్‌ వెంకటేశ్‌గా పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చాక ఫిష్‌ వెంకట్‌గా పేరు మారింది. గతంలో చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్‌కు 1989లో మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్‌ పరిచయమ్యారు. 1991లో ఆయన  నిర్మించిన ‘జంతర్‌ మంతర్‌’ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దివంగత నటుడు శ్రీహరి ఫిష్‌ వెంకట్‌కు మంచి స్నేహితుడు. ఆయన ప్రోద్భలంతోనే వెంకట్‌ సినిమాల్లో కొనసాగారు. 2002లో ఎన్టీఆర్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆది’ సినిమాతో వెంకట్‌కు గుర్తింపు వచ్చింది. అందులో ‘తొడకొట్టు చిన్నా’ అనే డైలాగ్‌ ఎంతో పాపులర్‌ అయింది. ఆ సినిమాలోనే వెంకట్‌ సినిమాల్లో నిలదొక్కుకున్నారు.

అక్కడి నుంచి వినాయక్‌ తీసిన ప్రతి సినిమాలో ఆయన అవకాశం అందుకున్నారు. అందుకే సినిమాలు చేయమని ప్రోత్సహించిన శ్రీహరిని అన్నగానూ, పరిశ్రమలో వి.వి.వినాయక్‌ గాడ్‌ ఫాదర్‌గానూ భావిస్తానని వెంకట్‌ పలు సందర్భాల్లో చెప్పారు. ‘ఆది’ చిత్రం చేసే సమయంలోనే  వెంకట్‌ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ర్టీలో వెనక్కి తిరిగే చూసే అవకాశం ఉండదని వినాయక్‌ అప్పుడే చెప్పారట. ఫిష్‌ వెంకట్‌ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్‌గా అలరించారు. అగ్ర తారల సినిమాల్లో పాజిటివ్‌, నెగటివ్‌ పాత్రలో పోషించారు. విలన్‌ గ్యాంగ్‌లో కీలకంగా కనిపించి అన్నా.. అన్నా..  అంటూ ఎన్నో పాత్రలను పండించారు. సీరియస్‌ విలన్‌గానే కాకుండా కామెడీ విలన్‌గానూ ఆకట్టుకున్నారు.

ఆది, సీతయ్య, దిల్‌, బన్నీ, కందిరీగ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్‌, డీజే టిల్లు, కింగ్‌, డాన్‌ శీను, మిరపకాయ్‌, దరువు, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌ తదితర హిట్‌ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకట్‌ నటించిన చివరి చిత్రం ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు.

ఫిష్‌ వెంకట్‌ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:06 PM