80s Reunion: 80 రీ- యూనియన్ ఎలా మొదలయింది.. ప్లాన్.. ప్లానింగ్ ఎవరిది
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:51 AM
వారికి ప్రతి ఏడాది దీపావళి ముందే వచ్చేస్తుంది. మాటలు టపాసుల్లా పేలుతాయి. నవ్వులు మతాబుల్లా విరుస్తాయి.చిరు చిరు జ్ఞాపకాలు చిచ్చుబుడ్లలా వెలుగుతాయి.. ఇక గిల్లికజ్జాలు... ఆటలు... పాటలు.. మాటలు... వీటికి కొదవే ఉండదు.
వారికి ప్రతి ఏడాది దీపావళి ముందే వచ్చేస్తుంది. మాటలు టపాసుల్లా పేలుతాయి. నవ్వులు మతాబుల్లా విరుస్తాయి.
చిరు చిరు జ్ఞాపకాలు చిచ్చుబుడ్లలా వెలుగుతాయి.. ఇక గిల్లికజ్జాలు... ఆటలు... పాటలు.. మాటలు... వీటికి కొదవే ఉండదు.
అందరూ చిన్నపిల్లలైపోతారు. ఆ కాసేపు... మెగాస్టార్, సూపర్‌స్టార్, మామూలు స్టార్... ఇలాంటి భేదాలేవీ ఉండవు. ఇదంతా ఎక్కడంటారా?
‘80’ రీ-యూనియన్‌లో! (80S ReUnion)
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ... రీ-యూనియన్ జరిగింది. ఆ ముచ్చట్లను అలనాటి హీరోయిన్లు సుహాసిని, లిజి, కుష్బూ, పూర్ణిమా భాగ్యరాజా - ‘నవ్య’ కోసం ప్రత్యేకంగా పంచుకున్నారు..
అందరికీ ఒకే డ్రస్‌కోడ్ ఉంటుందా?
లిజి: దీని వెనక చాలా ప్లానింగ్ ఉంటుంది. రీ-యూనియన్ పార్టీలోనే- వచ్చేసారి ఎక్కడ నిర్వహించాలి? థీమ్ ఏమిటి? డ్రస్ కోడ్ ఏమిటనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత ఎవరి డిజైనర్‌తో వాళ్లు డిజైన్ చేయించుకుంటారు. పార్టీకి వచ్చే వారు డ్రస్‌కోడ్‌ను పాటించాలి. డ్రస్ కోడ్‌తో పాటుగా రకరకాల ఆటలు ఉంటాయి. ఫెర్‌ఫార్మెన్స్‌లు ఉంటాయి.
సుహాసిని: సరదాగా ఇబ్బంది పెట్టే గేమ్స్ ఉంటాయి. అందరూ వాటిని ఆడాల్సిందే! ఉదాహరణకు సిల్క్‌స్మితలా డ్యాన్స్ చేయాలి అంటే - ఎంత పెద్ద సూపర్‌స్టార్ అయినా అలా డ్యాన్స్ చేయాల్సిందే! అందరం ఫ్రెండ్సే కదా... ఎలాంటి తారతమ్యాలు ఉండవు.
'ఇప్పటిదాకా జరిగిన రీ యూనియన్ పార్టీల్లో చిరంజీవి గారింట్లో జరిగింది మా అందరికీ చాలా స్పెషల్. ఎంతో ఎంజాయ్ చేశాం. అది ఇప్పటికీ మా అందరికీ గుర్తుంటుంది'
80 రీ-యూనియన్ ఎలా మొదలయింది?
లిజి: నేను ఒక ఫంక్షన్‌లో సుమలత, మోహన్‌లను కలిశాను. నేను, మోహన్ ఒకే ఊళ్లో (చెన్నైలో) ఉంటాం. కానీ ఎప్పుడూ కలవం. వాళ్లను కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ‘చెన్నైలో ఉన్నవాళ్లందరం ఒకసారి కలిస్తే...’ అనే ఆలోచన వచ్చింది. హాసిని (సుహాసిని)కి చెప్పాను. ‘చెన్నై నుంచే ఎందుకు? మిగిలిన ఊళ్ల నుంచి కూడా పిలుద్దాం’ అంది. ‘వాళ్లు వస్తారా?’ అని నాకు అనుమానం వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్, త్రివేండ్రం... ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్న వారిని పిలిచాం. వాళ్ల స్పందన చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఆలోచన నాదే అయినా... హాసిని అందరినీ ఒక చోట కలపగలిగింది. ఈ కథ అలా మొదలయింది.
కుష్బూ: నేను 80ల చివర్లో సినీ రంగానికి వచ్చాను. అందుకని నన్ను మొదటి సంవత్సరం పార్టీకి పిలవలేదు. రీ-యూనియన్ జరుగుతోందని తెలిసిన తర్వాత నేనే గేట్ క్రాష్ చేసి వచ్చేశా!
పూర్ణిమ: మొదటి కొన్నేళ్లు మా ఆయన (భాగ్యరాజా) రాలేదు. సాధారణంగా ఆయన ఎవరినీ కలవటానికి ఇష్టపడరు. ‘నేను డైరక్టర్‌ని కదా... మీ అందరూ యాక్టర్స్’ అనేవారు. కొన్నేళ్ల తర్వాత ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ‘రీ-యూనియన్ ఎప్పుడొస్తుందా?’ అని ఎదురుచూస్తూ ఉంటారు.
అందరినీ పిలుస్తారా? కొందరికే ఎంట్రీ ఉంటుందా?
సుహాసిని: అందుబాటులో ఉన్నవారందరినీ పిలుస్తాం. బాలీవుడ్ హీరో, హీరోయిన్లను కూడా పిలుస్తాం. ‘రా వన్’ సినిమా విడుదల సమయంలో షారుక్‌ఖాన్ చెన్నైకి వచ్చారు. తనకు ఏదో సాయం అవసరమయింది. నాకు ఫోన్ చేశారు. ‘80 రీ-యూనియన్ పనుల్లో బిజీగా ఉన్నా... ఎల్లుండి ఫోన్ చేస్తా’ అన్నా. షారూక్- ‘ నన్ను కూడా పిలవచ్చు కదా’ అన్నారు. ‘మీరు 90లలో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా...’ అన్నా. ‘కాదు, కాదు... నేను నటించటం మొదలుపెట్టింది 80లలోనే...’’ అన్నారు. ఆ రీ-యూనియన్‌కి ఆయన కూడా వచ్చారు. ఆమిర్‌ఖాన్ తాను కూడా వస్తానని ఫోన్ చేశారు. పద్మినీ కొల్హాపూరి, మీనాక్షీ శేషాద్రి, అనిల్ కపూర్, జాకీ ఫ్రాష్... ఇలా కొందరు రీ-యూనియన్‌కు వచ్చారు. మరి కొందరు మిస్ అవుతూ ఉండచ్చు. ఎవరిని పిలవాలనే విషయం హోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో దీన్ని హోస్ట్ చేస్తున్నారనుకుందాం. ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో... వారు తమ ఫ్రెండ్స్‌ను పిలవచ్చు. ఆ తర్వాత ఏడాది హోస్ట్ వాళ్లను పిలవకపోవచ్చు. అది వారిష్టం.
రీ-యూనియన్ పూర్తయిన తర్వాత ఎలా అనిపిస్తుంది?
పూర్ణిమ: 10 రోజులు వెల్‌నెస్ సెంటర్‌లో రిఫ్రెష్ అయి వచ్చినట్లుంది. ఆ ఆనందం బయట వాళ్లకు కూడా కనిపిస్తుంది.
లిజి: ఒక విధమైన హ్యాంగోవర్‌లో ఉంటాను. నా మిగిలిన స్నేహితులు ‘వచ్చేసారి థీమ్ ఏమిటి?’ అని అడుగుతూ ఉంటారు.
సుహాసిని: రీ-యూనియన్ పూర్తయిపోయి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక విధమైన సంతృప్తి కలుగుతుంది. సంతోషంగా అనిపిస్తుంది. అదే సమయంలో మనసులో అందరినీ వదిలి వెళ్తున్నాననే బాధ కూడా కలుగుతుంది. ‘అందరం ఒకే చోట ఉండిపోతే బావుంటుంది కదా’ అనిపిస్తుంది. ఈసారి శోభనకు త్రివేండ్రంలో ఒక ప్రోగ్రాం ఉంది. అది పూర్తి చేసుకొని 11 గంటల విమానం ఎక్కి, పార్టీకి 12.45కి వచ్చింది. మేమందరం ఉదయం 3.45 దాకా కలిసే ఉన్నాం. అయినా ఎవరూ కదలలేదు.
ఎవరు ఏం చేయాలనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
సుహాసిని: ఎవరు ఏ ఫెర్ఫార్మెన్స్ చేయాలనే విషయాన్ని డిజైన్ చేసేది నేనే! ఈసారి రీ-యూనియన్‌లో నదియా, నేను, కుష్బూ, జయశ్రీ చేసిన డ్యాన్స్ క్లిప్స్ బయటకు వచ్చాయి. ఇదంతా కేవలం పదిశాతం మాత్రమే! సాధారణంగా ఈ క్లిప్స్‌ను ఎప్పుడూ బయటకు వదలం- ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ కదా! ఈ డ్యాన్స్‌ను నదియా కంపోజ్ చేసింది. మేమందరం ఎలాంటి రిహార్సల్స్ లేకుండా ఆమెతో స్టెప్స్ వేసామంతే! ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను మంచి డ్యాన్సర్‌ను కాను. ఎప్పుడూ మిగిలిన పనుల్లో బిజీగా ఉంటా... అయినా మొదటి వరసలో నేనుంటా! ఎందుకంటే నేనే డిజైన్ చేస్తాను కాబట్టి స్టెప్స్ నాకు బాగా గుర్తుంటాయి. ఇక మెడ్లీ (అన్ని పాటల కదంబం)ల కోసం మేము రిహార్సల్స్ చేస్తాం. మాకు అదొక పిక్నిక్‌లా అనిపిస్తుంది. మొదట అందరూ ‘మాకు ఆ స్టెప్ రాదు... మేము ఆ స్టెప్ వేయలేం’... ఇలా రకరకాల కారణాలు చెబుతారు. కానీ చివరకు అందరూ కలిసే డ్యాన్స్ చేస్తాం. ఒకసారి శోభన ఒక డ్యాన్స్ కంపోజ్ చేసింది. నేను, అర్జున్, శోభన- ముగ్గురం దానిలో ఉన్నాం. ఆ డ్యాన్స్ అంతా ఏక్రోబాటిక్స్‌లా ఉంటుంది. దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. 2011లో అంబరీష్, సుమలత ఒక ప్రొఫెషినల్ కొరియోగ్రాఫర్‌ను పెట్టుకొని... ‘రియల్ నుంచి డిజిటల్ వరకు’ అని ఒక డ్యాన్స్ చేశారు. దాన్ని కూడా మరచిపోలేను.
అందరిలోను బాగా చలాకీగా.. చిలిపిగా ఉండేదెవరు?
కుష్బూ: మొత్తం అందరిలోను చిలిపి జయరాం!
సుహాసిని: నా ఉద్దేశంలో కుష్బూనే చిలిపి. బయట పెద్ద నటి కావచ్చు, రాజకీయ నాయకురాలు కావచ్చు. కానీ రీ-యూనియన్‌లో మాత్రం ఆ పొరలన్నీ తొలగిపోతాయి..
పూర్ణిమ: నా ఉద్దేశంలో సుహాసినే అందరి కన్నా చలాకీగా ఉంటుంది. అందరితోనూ కలిసిపోతుంది. నవ్వుతూ ఉంటుంది. నవ్విస్తూ ఉంటుంది.
మీ అందరూ ఒకప్పటి పోటీదారులే కదా.. ఇప్పుడెలా స్నేహితులైపోయారు?
పూర్ణిమ: ఆ రోజులు దాటిపోయాయి. ఇప్పుడు మేమందరం ఫ్రెండ్స్! ఆ ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఇక నా విషయానికి వస్తే- పెళ్లి అయిన తర్వాత నేను నటించటం మానేశాను. గృహిణిగా స్థిరపడ్డాను. అలాంటి సమయంలో మేమందరం రీ-యూనియన్ కోసం కలవటం మరపురాని విషయం.
సుహాసిని: ఒకప్పుడు మేము మిస్ అయిన వాటిని గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాం కూడా! ఉదాహరణకు భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్.. డార్లింగ్...డార్లింగ్’లో హీరోయిన్‌గా నేను నటించాలి. కానీ డేట్స్ లేకపోవటంతో పూర్ణిమ నటించింది. ఆమెకు భాగ్యరాజాతో పరిచయం అక్కడే! ‘నావల్లే నీకు భాగ్యరాజా దొరికాడు’ అంటూ ఉంటా.