Soggaadu: స్వర్ణోత్సవానికి సిద్దమవుతున్న సోగ్గాడు..

ABN , Publish Date - Nov 29 , 2025 | 07:03 PM

నటభూషణ శోభన్ బాబు (Sobyhan Babu) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సోగ్గాడు (Soggaadu) సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా.

Soggaadu

Soggaadu: నటభూషణ శోభన్ బాబు (Sobyhan Babu) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సోగ్గాడు (Soggaadu) సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన జయచిత్ర, జయసుధ నటించారు. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి.

ఇక ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పోస్టర్ ను రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సురేష్ బాబు, సీనియర్ దర్శకుడు కె.మురళీమోహనరావు , దర్శకుడు రేలంగి నరసింహారావు, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక పోస్టర్ రిలీజ్ తరువాత నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ' ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ నాకే కాదు ప్రతీ ఒక్కరినీ అలరించింది. అలాగే ఒకప్పుడు విజయా, సురేష్ మూవీస్ సంస్థలు కలిసి కొన్ని చక్కటి చిత్రాలు తీశాయి. ఆ తరువాత సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి...రెండు, మూడు చిత్రాలను నిర్మించిన అనంతరం తీసిన 'సోగ్గాడు' చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని' సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో తాము తీసిన 'సర్పయాగం' చిత్రం అనుభూతిని పంచుకుంటూ ఇదే రామానాయుడు స్టూడియోలోని సెకండ్ ఫ్లోర్ లో సంధ్యా సమయం లో ఒక షాట్ ను చాలా గొప్పగా చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఆ చిత్రీకరణలో అస్తమిస్తున్న సూర్యుని చూసి, శోభన్ బాబు తన చేతులను చూసుకుని పలికించిన అద్భుతమైన నటన తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. అంతేకాకుండా అలనాటి 'మానవుడు దానవుడు' చిత్రం తనకు ఎప్పటికీ ఇష్టమైన చిత్రంగా పేర్కొన్నారు.

శోభన్ బాబు కుటుంబం తరపున మేనల్లుడు, ప్రముఖ బిల్డర్ గద్దె నవీన్, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బి. బాలసుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్ రావు, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులు తదితరులు పాల్గొని, స్వర్ణోత్సవానికి ప్రేక్షకాభిమానులందరూ హాజరై, విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ త్వరలో ఉంటుందని వారు తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 07:03 PM