Sobhan Babu - Manjula: నాడు కుర్రకారును కిర్రెక్కించిన జంట... శోభన్ బాబు- మంజుల
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:29 PM
శోభన్ బాబు – మంజుల జంట 1970లలో తెలుగు సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 'మంచిమనుషులు' నుంచి 'జేబుదొంగ' వరకు వీరిద్దరి జంట తెరపై కనిపిస్తే కుర్రకారికి పండగే
ఆ నాటి అందాలతార మంజుల ఎంతోమంది రసికుల హృదయాలలో కలలరాణిగా రాజ్యమేలారు. తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ సరసన పలు చిత్రాలలో నాయికగా నటించి తనదైన బాణీ పలికించారు. మంజుల ఎంతమంది హీరోల సరసన నటించి విజయాలను చవిచూసినా, తెలుగులో ఆమెకు సరైన జోడీ అంటే శోభన్ బాబే అనేవారు. శోభన్ బాబు, మంజుల జంట నటించిన చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించారు.
శోభన్ బాబు (Sobhan Babu), మంజుల (Manjula) జంటగా రూపొందిన 'మంచిమనుషులు' (1974) సినిమా హిందీ మూవీ 'ఆగలే లగ్జా' రీమేక్. అయినా తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమాతోనే శోభన్ బాబు, మంజుల జంటకు విశేషమైన క్రేజ్ ఏర్పడింది.

ఆ తరువాత వారిద్దరూ నటించిన "అందరూ మంచివారే, జేబుదొంగ, గుణవంతుడు, పిచ్చిమారాజు, ఇద్దరూ ఇద్దరే, మొనగాడు, గడుసుపిల్లోడు" వంటి సినిమాలు సైతం ప్రేక్షకులను అలరించాయి. వీటిలో సింహభాగం విజయవంతమైనాయి.
ఇక్కడ మనం చూస్తున్న స్టిల్ 1975లో రూపొందిన 'జేబుదొంగ'లోనిది. అందులో "రేగాడు రేగాడు కుర్రాడు... ఇక ఆగమన్నా ఆగేట్టు లేడు..." అంటూ సాగే పాటలోది. 'జేబుదొంగ' ఘనవిజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది.