Small Producers: సినీ కార్మికుల డిమాండ్స్ నిర్మాతలకు పెను భారం

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:47 PM

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్స్ ను అమలు చేయడం కష్టమని రైజింగ్ ప్రొడ్యూసర్స్ తెలిపారు. నిజానికి తాము బర్నింగ్ ప్రొడ్యూసర్స్ అని ఎస్.కె.ఎన్. అన్నారు.

Small movie Producers

టాలీవుడ్ (Tollywood) లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్ (SKN), ధీరజ్ (Dheeraj), రాజేశ్ దండా (Rajesh Danda), ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె తదితరులు పాల్గొన్నారు.


ఈ ప్రెస్ మీట్ లో రాజేశ్ దండా మాట్లాడుతూ, 'చిన్న నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మా లాంటి నిర్మాతలకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఇబ్బందిపెడుతోంది. మా సినిమా దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు సమ్మె వల్ల షూటింగ్ ఆపేయాల్సివచ్చింది. లెక్క చూస్తే 150 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ సెట్ లో 50 మంది కూడా ఉండరు. వాళ్లకు ఇస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది. ఓటీటీ, డ‌బ్బింగ్ సినిమాల‌కు డ‌బ్బులు ఏవీ టైంకు రావ‌ట్లేదు. కానీ, మేం మాత్రం ఏ రోజుకి ఆ రోజు డ‌బ్బులివ్వాలంటే అయ్యే ప‌నేనా?' అని అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఒక చిన్న సీన్ చేయాలనుకుని జెనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ కావాలి. హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్... ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంతమందిని పెట్టుకోవడం పెనుభారంగా మారింది. వాస్తవానికి అక్కడ పనిచేసేది ఆరుగురు మాత్రమే' అని తెలిపారు. నిర్మాత ప్రైమ్ షో చైతన్య మాట్లాడుతూ, 'సినీ నిర్మాతల పరిస్థితి దయనీయంగా ఉంది. మన దగ్గరే కాదు దేశ విదేశాల్లోనూ ఫిలింమేకింగ్ ఇబ్బందుల్లో ఉంది. సినిమానే కాదు ఐటీ, రియల్ ఎస్టేట్ సహా ప్రతి ఇండస్ట్రీ స్లంప్ లో ఉంది. రేపు బాగుంటుందనే అందరూ పనిచేస్తున్నారు. మేము చెప్పిన వాళ్లనే పెట్టుకోండి, ఇంతమందిని ఖచ్చితంగా షూటింగ్ కు తీసుకోవాలి అనడం కరెక్ట్ కాదు' అని అన్నారు.


నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, 'మేమంతా ఇండస్ట్రీకి ప్యాషన్ తో వచ్చాం. సినిమాలు చేస్తున్నాం. యూనియన్స్ పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. ఈ యూనియన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిబంధనలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలి. తక్కువ మంది తో సరిపోయే షూటింగ్ లో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఒక సెట్ కోసమో, ఇంకో క్వాలిటీ కోసమే మేము పెట్టాల్సిన ఖర్చు ఇలా వృథా అవుతోంది. ఈ బంద్ ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు' అని చెప్పారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ, 'ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. మాకు పదవులు లేవు, మాట్లాడేందుకు పెదవులు తప్ప. ఇది గ్రూపిజం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాదు. చిన్న నిర్మాతలుగా మా బాధలు చెప్పుకునేందుకు పెట్టిన ప్రెస్ మీట్. గుడ్డు పెట్టేవాడికే తెలుస్తుంది బాధ. మీకు 30శాతం కాదు 50శాతం పెంచుతాం. కానీ థియేట్రికల్ గా రెవెన్యూ పరంగా, మేము పెట్టిన ఖర్చు పరంగా, ఏ రూపంలో అయినా మాకు పెట్టుబడి తిరిగొస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా?' అని ప్రశ్నించారు.

ఈ మీటింగ్ లో పాల్గొన్న నిర్మాతల గురించి ఎస్కేఎన్ మాట్లాడుతూ, 'నిజానికి మేం రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్. మాది మేకపోతు గాంభీర్యమే. చాలా మంది... 'నిర్మాతలకు ఏంటి?' అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సినిమాతో డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఇచ్చే నిర్మాత ఎవరైనా ఉన్నారా?' అని అడిగారు. సినీ కార్మికుల ముసుగులో కొందరు తమ స్వలాభం కోసం చూస్తున్నారని ఎస్కేఎన్ ఆరోపించారు. 'ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదని, పరిస్థితి అర్థం చేసుకుని సినిమాలు చేస్తున్నారని, యూనియన్లు కూడా ఇది మన ఇండస్ట్రీ, మన ప్రొడ్యూసర్స్ అనే భావనతో పనిచేయాలని ఎస్కేఎన్ కోరారు.

Also Read: Raviteja: ఎన్నాళ్లు ఈ రొట్ట కథలు.. రవితేజ

Also Read: Srujan Attada: వినాయక చవితి కానుకగా 'కన్యాకుమారి'

Updated Date - Aug 11 , 2025 | 05:47 PM