Srujan Attada: వినాయక చవితి కానుకగా 'కన్యాకుమారి'
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:13 PM
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'కన్యాకుమారి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వినాయక చవితి కానుకగా దీనిని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నారు.
గీత్ సైని (Geeth Saini) , శ్రీచరణ్ రాచకొండ (Sree charan Rachakonda) జంటగా నటిస్తున్న సినిమా 'కన్యాకుమారి' (Kanyakumari). రాడికల్ పిక్చర్స్ బ్యానర్ మీద సృజన్ అట్టాడ (Srujan Attada) స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ వినోదాత్మక ప్రేమకథ విడుదల తేదీ ఖరారైంది. వినాయక చవితి కానుకగా దీనిని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా సృజన్ అట్టాడ మాట్లాడుతూ, ''దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు అంటారు. రైతే దేశానికి వెన్నెముక అని అందరూ చెబుతారు. కానీ ఆ రైతుకు పిల్లను ఇవ్వడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. ఇదే ప్రధానాంశంగా ఈ సినిమాను రూపొందించాం. శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. పెంటపాడు అనే గ్రామంలో ఐదెకరాల రైతు తిరుపతి కథ ఇది. బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని శపథం చేసిన తిరుపతి కోరిక తీరిందా లేదా? అన్నదానిని వినోద ప్రధానంగా తెరకెక్కించాం' అని అన్నారు. ఈ సినిమాకు రవి నిడమర్తి సంగీతాన్ని అందించగా, శివ గాజుల, హరిచరణ్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరించారు.
విశేషం ఏమంటే... శతాధిక చిత్రాల దర్శకుడు దాసరి నారాయణ రావు 'కన్యాకుమారి' పేరుతో 1977లో సినిమాను రూపొందించారు. అందులో కన్య గా జయమాలిని, కుమారిగా శ్రీవిద్య నటించారు. బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పటి ఈ 'కన్యాకుమారి' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: Ntr - War-2: కన్నెర్ర చేశాడు... కాలర్ ఎగరేశాడు...
Also Read: Tollywood: సినిమాటోగ్రఫీ మంత్రితో నిర్మాతల భేటీ.. తదుపరి మంత్రి ఏమన్నారంటే...