Tollywood : నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
ABN, Publish Date - Oct 15 , 2025 | 12:23 PM
నేపథ్య గాయనిగా విశేషమైన పేరు, గుర్తింపు సంపాదించుకున్న రావు బాల సరస్వతి కన్నుమూశారు.
అలనాటి గాయని రావు బాలసరస్వతి దేవి (97) అనారోగ్యంతో హైదరాబాద్ మణికొండలోని స్వగృహంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1928 ఆగస్ట్ 29న జన్మించిన రావు బాలసరస్వతి గొంతు ఆకాశవాణి సంగీత కార్యక్రమాలతో తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో తొలి నేపథ్య గాయనిగానూ ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. 'స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు' తదితర చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఏ.పి. కోమల లాంటి వారితో కలిసి ఆమె పాటలు పాడారు.
రావు బాల సరస్వతి అసలు పేరు సరస్వతి. తల్లి తండ్రుల పేర్లు విశాలాక్షి, కావేటి పార్థసారధి. ఆమె తండ్రి గాయకులు, ప్రధానంగా వీణ, సితారు వాయించేవారు. చెన్నై లో కొంత కాలం ఉండి అనంతరం గుంటురుకి మారారు. ఆలకూరు సుబ్బయ్య వద్ద బాల సరస్వతి 1939లో కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించారు. ఆపైన బాల సరస్వతిని ఆమె తండ్రి ముంబై తీసుకెళ్ళి, హిందుస్తానీ సంగీత ప్రముఖులైన ఖేల్కర్, సినీ సంగీత దర్శకులు వసంత్ దేశాయ్ వద్ద అభ్యాసం చేయించారు. అలానే మద్రాసులో పిచ్చుమణి అయ్యర్ దగ్గర ఆమె వీణ నేర్చుకున్నారు.
సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన 'సతీ అనసూయ'లో రావు బాలసరస్వతి గంగ వేషం వేశారు. ఆ యూనిట్ లో ఆమె చిన్నపిల్ల. దానికి ఆకుల నరసింహారావు సంగీత దర్శకులు. చిన్నప్పుడు పాటలు పాడటానికి వెళ్ళినప్పుడు ఆమెను బేబీ సరస్వతి అని పిలిచేవారు. ఆ తర్వాత బాల సరస్వతి అనడం మొదలు పెట్టారు. అదే చివరకు ఆమె పేరు అయిపోయింది. బాల సరస్వతి సుమారు 12 సినిమాలలో బాల నటిగా కనిపించారు. 1943లో ప్లే బ్యాక్ కొత్తగా వచ్చింది. దానికి ముందు ఎవరి పాటలు వారే పాడుకునే వారు. ఆ సమయంలో భాగ్యలక్ష్మీ సినిమాకు మొట్టమొదటగా ప్లే బ్యాక్ పాడారు బాల సరస్వతి. పెద్దాయక ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో పాటలు పాడారు. ముఖ్యంగా శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, కృష్ణశాస్త్రి రాసిన పాటలను ఆమె ఎక్కువగా పాడారు.
కోలంక జమీందారీకి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు ఆమెను 1944లో వివాహమాడారు. జమీందారీ కట్టుబాట్ల వల్ల, నటిగా సినిమాల్లో పాల్గొనడం తగ్గించారు. రాను రాను సినీ నేపథ్య గాయనిగా ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషల్లో సైతం ఎన్నో పాటలు పాడారు. 1974లో విజయనిర్మల దర్శకత్వం వహించిన 'సంఘం చెక్కిన శిల్పాలు' చిత్రంలో ఆమె పాట పాడారు. అదే సమయంలో సి. నారాయణరెడ్డి రాసిన మీరా భజన్స్ నూ గానం చేశారు.
అష్టపదులు, తరంగాలు, జావళీలు, తెలుగు మీరా భజనలు, లలిత గీతాలను సాలూరి హనుమంతరావు, సాలూరి రాజేశ్వర రావు, రమేష్ నాయుడు, బాలాంత్రపు రజనీకాంత రావు, పెండ్యాల నాగేశ్వర రావు మొదలైన ప్రముఖ సంగీత కర్తల నిర్దేశకత్వంలో ఆమె పాడగా, ఆకాశవాణిలో అవి ప్రసారమయ్యాయి. సాలూరి రాజేశ్వరరావు తో పాడిన ప్రైవేటు గీతాల ఆల్బమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.
రావు బాలసరస్వతికి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయి. రామినేని ఫౌండేషన్, అజో - విభో కందాళం ఫౌండేషన్, పాలగుమ్మి విశ్వనాథం స్మారక పురస్కారం ఇలా అనేక అవార్డులు లభించాయి.