i bomma: ఐ బొమ్మ, బప్పం టీవీ క్లోజ్.. రవితోనే మూసి వేయించిన పోలీసులు
ABN, Publish Date - Nov 17 , 2025 | 06:03 AM
'మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది. మా మీద ఫోకస్ చెయ్యకండి. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరు' అంటూ గతంలో తమకు సవాలుకు విసిరిన బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే. పోలీసులు ఆ వెబ్ సైట్లను మూసి వేయించారు.
తమను సవాలు చేసిన ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్లను మూసివేయించిన పోలీసులు
రవి ఇంటి పేరే ఐ బొమ్మలో 'ఐ'.. రవిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
మా అబ్బాయి ఇలా ఎందుకు చేశాడో తెలియదు: రవి తండ్రి అప్పారావు
ఐ బొమ్మ (I-Bomma), బప్పం టీవీల్లో పైరసీ సినిమాల ఆట ముగిసింది. 'మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది. మా మీద ఫోకస్ చెయ్యకండి. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరు' అంటూ గతంలో తమకు సవాలుకు విసిరిన బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే. పోలీసులు ఆ వెబ్ సైట్లను మూసి వేయించారు.
ఇమ్మడి రవిని ((I Ravi) శనివారం అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. అతని వద్ద నుంచి వెజ్ లాగిన్లు, సర్వర్ వివరాలు తీసుకొని అతనితోనే ఆయా సైట్లను మూసివేయించారు. పోలీసులు సాధించిన ఈ విజయంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు: వ్యక్తమవుతున్నాయి.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది.
అయితే, కేసు దర్యాప్తులో భాగంగా రవిని మరింత లోతుగా విచారించేందుకు రవిని ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవిని అదుపులోకి తీసు కొని లోతుగా విచారిస్తే.. ఈ పైరసీ వ్యవహారం వెనక మరెవరు ఉన్నారో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, రవిపై నమోదైన తీవ్ర నేరం దృష్ట్వా అతనికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఐ బొమ్మలో ఐ అంటే ఇమ్మడి
ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి తన ఇంటి పేరులోని మొదటి అక్షరం ఐ ని తీసుకొని ఐ బొమ్మ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేసిన ఇమ్మడి రవి.. రెండు ఐటీ సంస్థ లకు సీఈవోగా పని చేశాడు. కొన్నేళ్లకు ఆ ఉద్యోగం మానేసి నేరాల బాటపట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లాడిన రవి. ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఐబొమ్మ కార్యకలాపాలు మొదలు పెట్టాడు.
కొత్త సినిమాని, విడుదలైన రోజే దొంగచాటుగా థియేటర్లలో వీడియో తీయించడం. వాటిని వెంటనే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం చేస్తుండే వాడు. అలాగే ఓటీటీలో విడుదలైన సినిమాలను కూడా హెచ్‌డీ ప్రింట్‌తో ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు ఐబొమ్మ దెబ్బకు సినీ నిర్మాతలు, ఓటీటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయేవి ఈ క్రమంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తుల మేరకు ఐబొమ్మపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు.
దీంతో మమ్మల్ని ఆపలేరు. వెతకలేరు అంటూ పోలీసులను సవాలు చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్ రెండేళ్ల క్రితం ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో దుమారమే రేపగా. కేసును పోలీసులు మరింత సవాలుగా తీసుకున్నారు. అయితే, పోలీసు నిఘా పెరగడంతో తెలివి ప్రదర్శించిన రవి బప్పం టీవీ పేరిట మరో ఖాతా ప్రారంభించి కొంతకాలంగా అందులో పైరసీ సినిమాలు అప్ లోడ్ చేస్తున్నాడు. ఐబొమ్మ నిర్వాహకులను ఎలా గైనా పట్టుకుంటామని మూడు నెలల క్రితం అప్పటి హైదరాబాద్ సీపీ ఆనంద్ కూడా ప్రకటించారు.
ఈ క్రమంలో నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని కూకట్పల్లిలోని అతడి నివాసంలోనే అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. కాగా, కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా పేజ్ అపార్ట్మెంట్ రవికి ఓ ఫ్లాట్ ఉందని పోలీసులు గుర్తించారు. రవి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళుతుంటాడని.. రవికి సంబంధించిన ఇతర వివరాలు తమకు తెలియని అపార్ట్ మెంట్అ సోసియేషన్ సభ్యులు పోలీసులకు తెలిపారు.
ఎందుకు ఇలా చేశాడో తెలియదు
ఐ. బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి తండ్రి ఇమ్మడి అప్పారావు విశాఖపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రవి ఎందుకు ఇలా చేశాడో తమకు తెలియదని చెప్పారు. రవి రాంగ్ రూట్లో వెళ్లాడని, ఆ సంగతిని ఇక పోలీసులే చూసుకుంటారని పేర్కొన్నారు. తాము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన రవి.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కొన్నాళ్లకు ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నాడని తెలిపారు.