సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shivashakti Datta: బహుముఖ ప్రజ్ఞాశాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:28 AM

‘కళ లేకపోతే జీవితమే లేదు’ అంటూ చిన్నతనం నుంచి కళపై మక్కువ పెంచుకుని, కళారంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఇక లేరు...

కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత

‘కళ లేకపోతే జీవితమే లేదు’ అంటూ చిన్నతనం నుంచి కళపై మక్కువ పెంచుకుని, కళారంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఇక లేరు. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా బాధ పడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌ మణికొండలోని తన ఇంట్లో కన్ను మూశారు. దర్శకుడు రాజమౌళి, గుణ్ణం గంగరాజు, మహేశ్‌బాబు తదితరులు ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. శివశక్తిదత్తా అంత్యక్రియలను ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు.

1932 అక్టోబర్‌ 8న జన్మించిన శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తండ్రి విజయ అప్పారావు ఆ రోజుల్లోనే పెద్ద కాంట్రాక్టర్‌. హైవే వర్క్స్‌, పీడబ్ల్యూ డి వర్క్స్‌ చేసేవారు. ఆయన రెండో సంతానమే సుబ్బారావు. ఊహ తెలిసిన తర్వాత తన పేరుని బాబూరావుగా మార్చుకున్నారు సుబ్బారావు. పదిహేనేళ్ల వయసు వచ్చాక చిత్ర లేఖనం నేర్చుకోవాలనే కోరికతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్లి, అక్కడ జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చేరారు. రెండేళ్ల తర్వాత సొంతవూరుకి తిరిగి వచ్చి తను నేర్చుకున్న చిత్ర లేఖనంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘కమలేశ్‌’ పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తన పేరుని ‘శివశక్తి దత్తా’ గా మార్చుకుని చివరి వరకూ అదే పేరుతో కొనసాగారు సుబ్బారావు.


ఆడ గొంతుతో పాటలు

శివశక్తి దత్తా ప్రతిభ కుంచెకే పరిమితం కాలేదు. సంగీతంపై మక్కువ కలిగి వీణ, గిటార్‌, సితార్‌, హార్మోనియం నేర్చుకున్నారు. కథలు, కవితలు రాసేవారు. పాత సినిమాల్లో భానుమతి, కన్నాంబ, ఎస్‌.వరలక్ష్మి పాటలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆడ గొంతుతో ఆయన కాలేజీ ఫంక్షన్స్‌లో పాటలు పాడుతుంటే జనం మైమరచి వినేవారు. ఆయన పాట లేకుండా ఆ రోజుల్లో కాలేజీలో ఏ ఫంక్షన్‌ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. సినిమా రంగం కూడా ఆయన్ని ఆకర్షించడంతో మద్రాసు వెళ్లి ఎల్వీ ప్రసాద్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు శివశక్తి దత్తా. రెండేళ్లు ఆయన దగ్గర పని చేసిన తర్వాత దర్శకుడు హేమాంబరధరరావు దగ్గర చేరారు. ఆయన తొలి చిత్రం ‘తండ్రులు కొడుకులు’ లో ఓ చిన్న పాత్ర కూడా పోషించారు. ఆ తర్వాత వారి తండ్రి మరణంతో సొంతవూరు వెళ్లిన శివశక్తి దత్తా 16 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాగా డబ్బు సంపాదించి, సొంతంగా సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో తమ్ముడు విజయేంద్ర ప్రసాద్‌తో కలసి మళ్లీ మద్రాసులో అడుగుపెట్టారు. సొంత సినిమా నిర్మాణం వారికి కలసి రాలేదు. ఉన్న డబ్బు అంతా పోయింది. బతుకు తెరువు కోసం ఘోస్ట్‌ రైటర్స్‌గా చాలా చిత్రాలకు పని చేశారు. చివరకు దర్శకుడు రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో ‘జానకి రాముడు’ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలకు రచన చేశారు.


నాలుగు భాషల్లో పాటలు

శివశక్తి దత్తా ప్రతిభా శాలి. తెలుగు చిత్రాల్లో పాటలు రాయడమే కాకుండా తమిళం, కన్నడం, హిందీ నేర్చుకుని ఆయా భాషా చిత్రాల్లో పాటలు రాశారు. సంస్కృతంలో కూడా పాండిత్యం ఉండడంతో ఆ భాషలో కూడా పాటలు రాశారు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’ చిత్రంలో ‘అగ్ని స్కలన సందగ్దయుతు వర్గ ప్రళయ రథ ఛత్రపతి’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను సంస్కృతంలోనే శివశక్తి దత్తా రాశారు. అలాగే ‘బాహుబలి’లో ‘మమతల తల్లి’, ‘ధీవర’ పాటలను ఆయన రాశారు. ఎన్‌టీఆర్‌ బయోపిక్‌ ’కథానాయకుడు’లో టైటిల్‌ సాంగ్‌ కూడా రాశారు.

కొడుకుకు ఆ రాగం పేరు

శివశక్తి దత్తాకు కొడుకు కీరవాణి అంటే ఎంతో అభిమానం. ఆయనకు కూడా తండ్రి అంటే ప్రాణం. ‘విప్రనారాయణ’ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలీ’ పాట అంటే శివశక్తి దత్తాకు ఎంతో ఇష్టం. కీరవాణి రాగంతో ఆ పాటను స్వరపరిచారని తెలుసుకున్న శివశక్తి దత్తా తన కొడుకుకి అదే పేరు పెట్టారు. సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని తరచూ చెప్పే శివశక్తి దత్తా కీరవాణి ఆస్కార్‌ అవార్డ్‌ అందుకుంటున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యారు.


దర్శకుడిగానూ...

శివశక్తి దత్తా దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘పిల్లన గ్రోవి’ చిత్రంలో జేవీ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. 1995లో మొదలైన ఈ చిత్రంలో మూగ బాలికగా ఐదేళ్ల ఎం.ఎం.శ్రీలేఖ కీలక పాత్ర పోషించారు. ఉన్న డబ్బంతా ఖర్చు కావడంతో పతాక సన్నివేశాలు తీయడానికి డబ్బు లేక సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో శివశక్తి దత్తా, ఆయన సోదరులతో పాటు రాజమౌళి, కీరవాణి కూడా నటించడం విశేషం. ఆ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. ఈ ప్రింట్‌ ఇప్పటికీ చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లోని బాక్సుల్లో భద్రంగా ఉంది. ఆ తర్వాత ‘అర్ధాంగి’ చిత్రానికీ, ‘చంద్రహాస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమలో ఇన్ని శాఖలలో పని చేసినా దర్శకత్వం అంటేనే తనకు ఇష్టమని శివశక్తి దత్తా చెప్పేవారు.

ప్రముఖుల నివాళి

శివ శక్తి దత్తా మరణం పట్ల తెలంగాణ ముఖ్య మంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి, తనదైన శైలిలో రచనలు చేస్తూ, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న శివశక్తిదత్తా ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. ‘శివశక్తి దత్తా శివైక్యం చెందారన్న వార్త నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు. ‘కళలు, సాహిత్యంపై ఎంతో మక్కువ కలిగిన మంచి మనిషి శివశ క్తి దత్తా. ఆయన మరణం బాధించింది. వారి కుటుంబానికి నా సానుభూతి’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:30 AM