Sharwanand: సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా...
ABN, Publish Date - Dec 06 , 2025 | 05:07 PM
ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, ఆరవ చిత్రంగా శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతోంది. గతంలో ఈ సీజన్ లో వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి' హిట్ కావడంతో తమ చిత్రాన్ని అదే సీజన్ లో రిలీజ్ చేస్తామని అనిల్ సుంకర చెబుతున్నారు.
శర్వానంద్ (Sharwanand) కెరీర్ లో ఇప్పటికి రెండు సార్లు అతని సినిమాలు సంక్రాంతి సీజన్ లో వచ్చాయి. అదీ జనవరి 14న. ఈ రెండు సార్లు కూడా శర్వానంద్ పెద్ద హీరోల సినిమాలతోనే పోటీ పడ్డాడు. 2016లో తొలిసారి శర్వానంద్ నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' (Express Raja) మూవీ పొంగల్ కు విడుదలైంది. ఆ యేడాది ఆ సీజన్ లో నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున (Nagarjuna) 'సోగ్గాడే చిన్నినాయనా', జూ. ఎన్టీఆర్ (Jr. NTR) 'నాన్నకు ప్రేమతో' సినిమాలు విడుదలయ్యాయి. అయితే... ఈ సినిమాలతో పాటే శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' సూపర్ హిట్ అయ్యింది. అలానే ఆ తర్వాత సంవత్సరం చిరంజీవి (Chiranjeevi) కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ (Balakrishna) 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలతో శర్వానంద్ 'శతమానం భవతి' (Shatamanam Bhavati) పోటీ పడింది. ఆ సమయంలోనూ ఆ రెండు సినిమాలతో పాటు శర్వానంద్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు... ఈ సినిమా జాతీయ అవార్డునూ గెలుచుకుంది. దాంతో అదే సెంటిమెంట్ మరోసారి ఫలిస్తుందనే నమ్మకంతో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర... శర్వానంద్ తో తాను నిర్మిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ ముందు రెండు సినిమాలు వచ్చిన జనవరి 14నే దీన్ని విడుదల చేస్తారా? లేకపోతే ఒకటి రెండు రోజులు ముందు లేదా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి.
ఈ యేడాది సంక్రాంతి బరిలో భారీ పోటీనే నెలకొంది. చిరంజీవి, వెంకటేశ్ 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ 'ది రాజా సాబ్', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు'తో పాటు విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'జన నాయకుడు' కూడా పొంగల్ బరిలో దిగుతున్నాయి. సో... ఇప్పుడు ఈ ఐదు చిత్రాలతో పాటు ఆరో చిత్రంగా శర్వానంద్ మూవీ రంగంలో నిలువబోతోంది. మరి వీటిల్లో ఏయే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.