సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ప్రముఖ పంపిణీదారుడు రమేశ్‌ హఠాన్మణం

ABN, Publish Date - Jun 22 , 2025 | 10:16 AM

ఆంధ్ర, సీడెడ్ కు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శక్తి పిక్చర్స్ రమేశ్‌ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న ఆయన దాదాపు రెండు వేల తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను పంపిణీ చేశారు.

ఆంధ్ర, సీడెడ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు, శక్తి పిక్చర్స్ (Sakthi Pictures) అధినేత ముత్యాల రమేశ్‌ (Mutyala Ramesh) జూన్‌ 21, శనివారం సాయంత్రం విజయవాడలో కన్నుమూశారు. మచిలీపట్నం (Mahcilipatnam) లో 1957 జూన్‌ 6న లో జన్మించిన రమేశ్‌ విద్యాభ్యాసం అనంతరం విజయవాడ చేరారు. విజయవాడ నవరంగ్ (Navarang) థియేటర్ లో పనికి చేరి, మేనేజర్ గా ఎదిగారు. 1976లో సొంతంగా శక్తి పిక్చర్స్ పంపిణీ సంస్థను స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో దాదాపు రెండు వేల సినిమాలను ఆంధ్ర, సీడెడ్ లో పంపిణీ చేశారు.

కేవలం సినిమా పంపిణీకే పరిమితం కాకుండా కృష్ణాజిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీగానూ ముత్యాల రమేశ్‌ సేవలు అందించారు. అలానే 2006లో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా అత్యధిక మెజారీటీతో గెలిచారు. ఛాంబర్ సెక్రటరీగానూ మూడు పర్యాయాలు ఆయన సేవలు అందించారు. తెలుగుతో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను సైతం శక్తి పిక్చర్స్ సంస్థ నుండి పంపిణీ చేశామని ఆ సంస్థలో చిరకాలంగా మేనేజర్ గా ఉన్న వెంకట రమణ తెలిపారు. రమేశ్‌ కొన్ని డబ్బింగ్ చిత్రాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. విజయవాడలోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయానికి ముత్యాల రమేశ్‌ భౌతిక కాయాన్ని సందర్శనార్థం తీసుకొచ్చి, మధ్యాహ్నం అంత్యక్రియలు జరుపుతున్నట్టు రమణ చెప్పారు. ముత్యాల రమేశ్‌ మరణవార్త తెలియగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ప్రెసిడెంట్ భరత్‌ భూషణ్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌, ముత్యాల రాందాస్, మోహన్ గౌడ్, సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మీ విజయవాడకు చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ చెన్నయ్ నుండి విజయవాడకు చేరి అంతిమ దర్శనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ రమేశ్‌ మృతికి సంతాపం తెలిపారు. విజయవాడలోని కొన్ని థియేటర్లు రమేశ్‌ మృతికి సంతాప సూచకంగా మార్నింగ్ షోస్ ను రద్దు చేశాయి. ముత్యాల రమేశ్‌ కు తల్లి సుశీల, భార్య లలిత ఉన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 10:19 AM