సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saroja Devi: నందమూరీ సరోజాదేవీయం...

ABN, Publish Date - Jul 14 , 2025 | 01:06 PM

నటరత్న ఎన్టీఆర్ తమ యన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన చిత్రాల ద్వారా పలువురు నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. యన్టీఆర్ పరిచయం చేసిన నటీమణుల్లో నిస్సందేహంగా బి.సరోజాదేవి అగ్రపథాన నిలుస్తారు.

నటరత్న ఎన్టీఆర్ (NTR) తమ యన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన చిత్రాల ద్వారా పలువురు నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. యన్టీఆర్ పరిచయం చేసిన నటీమణుల్లో నిస్సందేహంగా బి.సరోజాదేవి (B Saroja Devi) అగ్రపథాన నిలుస్తారు. యన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు యన్.త్రివిక్రమ రావు నిర్మించిన 'పాండురంగ మహాత్మ్యం' (1957) చిత్రం ద్వారానే సరోజాదేవి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా ఎన్టీఆర్ సరసనే సరోజాదేవి నాయికగా నటించడం విశేషం! యన్టీఆర్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా సరోజాదేవి సక్సెస్ రూటులో సాగారు. 'పాండురంగ మహాత్మ్యం'లో వేశ్య కళావతి పాత్రలో సరోజాదేవి నటించారు. అందులో యన్టీఆర్ కు జోడీగానే కనిపించినా, ప్రధాన నాయికగా అంజలీదేవి అభినయించారు. ఈ చిత్రం సాధించిన ఘనవిజయంతో తెలుగునాట మొదట్లోనే సరోజా దేవికి మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఆపై యన్టీఆర్ హీరోగా రూపొందిన 'భూకైలాస్' (1957)లో నాగభూషణం శివునిగా, బి.సరోజాదేవి పార్వతిగా అభినయించారు. ఈ సినిమా సైతం మంచి విజయం సాధించింది.



ఆ తర్వాత యన్టీఆర్, సరోజాదేవి కలసి నటించిన 'ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, మంచి- చెడు, దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధము, దానవీరశూరకర్ణ, సమ్రాట్ అశోక' వంటి చిత్రాలు తెలుగువారిని అలరించాయి. వీటిలో 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన సరోజాదేవి  'సమ్రాట్ అశోక' లో కర్మణి పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలు మినహా అన్ని చిత్రాలలోనూ యన్టీఆర్ కు జోడీగా నటించారు సరోజాదేవి. మరో విశేషమేమిటంటే యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'సీతారామ కళ్యాణం' (1961)లో ఆయన రావణబ్రహ్మ పాత్ర పోషించగా, ఆయనకు జోడీగా మండోదరి పాత్రలో అలరించారు సరోజాదేవి. యన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా 'సమ్రాట్ అశోక' (1992)లోనూ సరోజాదేవి కీలక పాత్ర ధరించడం విశేషం!



యన్టీఆర్ జోడీగా సరోజాదేవి నటించిన చిత్రాలలో 'సీతారామకళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూర కర్ణ' వంటి పౌరాణికాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక సాంఘిక చిత్రాలలో 'ఇంటికి దీపం ఇల్లాలే, మంచి- చెడు, దాగుడు మూతలు, మనుషుల్లో దేవుడు' సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. జానపదాల్లో ఎవర్ గ్రీన్ హిట్ గా వారిద్దరూ నటించిన 'జగదేకవీరుని కథ' నిలచింది. అలాగే "భాగ్యచక్రము, విజయం మనదే" వంటి జానపదాలూ అలరించాయి. పౌరాణిక, జానపద, సాంఘికాల్లో యన్టీఆర్ సరసన నటించి విజయాలు చూసిన సరోజాదేవికి రామారావుతో ఓ తీరని కోరిక మిగిలింది. అదేమిటంటే వెండితెర శ్రీకృష్ణునిలా అనితరసాధ్యంగా సాగిన యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ధరించిన చిత్రంలో తాను ఆయనకు జోడీగా నటించాలన్నది సరోజాదేవి అభిలాష. యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ధరించిన 'శ్రీకృష్ణార్జునయుద్ధం, దానవీరశూర కర్ణ' చిత్రాలలో సరోజాదేవి నటించినా శ్రీకృష్ణ పాత్రకు జంటగా నటించలేదు. అందువల్లే అది తనకు తీరని కోరికగా చెప్పుకొనేవారు సరోజాదేవి.

Updated Date - Jul 14 , 2025 | 01:17 PM