సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saroja Devi: ఆ కాంతి తరిగిపోదు... సరోజాదేవి కీర్తి కరిగిపోదు

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:52 PM

కథానాయికగా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి తనదైన శైలి ముద్ర వేశారు సరోజాదేవి. వృద్ధాప్య సమస్యతో సోమవారం ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో మరణించారు.

Actress B Saroja Devi

జలకాలటలతో.. కలకలపాటలతో..

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.

వాన కాదు.. వానా కాదు.. వరద రాజా ..

అంటూ హుషారైన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించారు అలనాటి అందాల తార బి.సరోజాదేవి( Actress B Saroja Devi). కథానాయికగా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి తనదైన శైలి ముద్ర వేశారు. వృద్ధాప్య సమస్యతో సోమవారం ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో మరణించారు . తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన ఆమె నటించారు. 13 ఏళ్ల వయసులో చిత్ర రంగంలో అడుగుపెట్టిన సరోజాదేవి దాదాపు 200 చిత్రాల్లో నటించి అభినయ సరస్వతిగా గుర్తింపు పొందారు. సరోజాదేవి ఇక లేరు అన్న నిజం దక్షిణాది చిత్ర రంగాలకు దిగ్భ్రాంతికి  గురి చేసింది.  


కన్నడ నాట పుట్టినా తెలుగువారిని అందాల అభినయంతో ఆకట్టుకున్నారు బి.సరోజాదేవి... నాటి మేటి నటుల చిత్రాలలో సరోజాదేవి అందం చిందులు వేసిన తీరు మరపురానిది... మరువలేనిది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలు పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకుంటారు. సరోజాదేవి ఆమె కన్నవారికి నాల్గవ సంతానం. ఆమె తండ్రి భైరయ్య పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవారు. నలుగురిని పోషించే స్తోమత లేదని భైరయ్య తండ్రి సరోజాదేవిని వేరేవారికి దత్తత ఇవ్వాలని చూశారు. అయితే భైరయ్య మాత్రం తన కూతురును తానే పోషిస్తానని, చిన్నతనంలోనే డాన్స్ నేర్పించారు. అదే సరోజాదేవిని చిత్రసీమ వైపు ఆకర్షించేలా చేసింది..



పార్వతీదేవిగా.. 

అందాలతారగా అభిమానుల మదిని దోచుకున్న బి.సరోజాదేవి హొన్నప్ప భాగవతార్ నటించి, రూపొందించిన 'మహాకవి కాళిదాసు' అనే కన్నడ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు. వరుసగా కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన తరువాత ఓ తమిళ సినిమాలోనూ సరోజా అందం మురిపించింది. ఆ తరువాత ఎన్టీఆర్ తన సొంత చిత్రం 'పాండురంగ మహాత్మ్యం' తో తెలుగు తెరకు సరోజాదేవిని పరిచయం చేశారు. 'పాండురంగ మహాత్మ్యం' సమయంలో 'భూ కైలాస్'లో పార్వతి దేవి గా నటించారు సరోజాదేవి. ఆ తరువాత ఏయన్నార్ 'పెళ్లి సందడి లో ఓ పాత్ర పోషించారు. కానీ, ఏయన్నార్ తో ఆమె నటించిన 'పెళ్ళికానుక' నటిగా సరోజా దేవికి మంచి మార్కులు సంపాదించి పెట్టింది. 


మండోదరిగా...  

'పెళ్ళికానుక' సమయంలోనే యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'సీతారామ కళ్యాణం లో రామారావు రావణునిగా నటించగా, సరోజాదేవి మండోదరిగా అభినయించారు. ఈ చిత్రం విడుదలైన ఇరవై రోజులకే యన్టీఆర్, సరోజాదేవి జంటగా తెరకెక్కిన 'ఇంటికి దీపం ఇల్లాలే' విడుదలయింది. అందులోనూ సరోజాదేవి గ్లామర్ గమ్మత్తుగా జనాన్ని ఆకట్టుకుంది. దక్షిణాదిన నాటి మేటి హీరోలందరి సరసన సరోజాదేవి అభినయించి అలరించారు. సరోజాదేవి నవ్వు మోము చూస్తే చాలు అనుకొనేవారు ఆమె నటించిన చిత్రాలను చూడటానికి థియేటర్లకు పరుగులు తీశారు. ఏయన్నార్ తో సరోజాదేవి నటించిన  చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వారిద్దరిపై 'ఆత్మబలం' చిత్రం కోసం  చిత్రీకరించిన వాన పాట అప్పట్లో కుర్రకారును కిర్రెక్కించింది. ఆ పాట ఈ నాటికీ అభిమానులను మురిపిస్తూనే ఉండడం విశేషం. సరోజాదేవిని తెలుగు సినిమా రంగానికి యన్టీఆర్ పరిచయం చేయగా, ఆయనతో అనేక చిత్రాల్లో నాయికగా నటించి మురిపించారామె. 


మానవమాత్రురాలు కాదని..    

అయితే ఎన్టీఆర్ కు చెల్లెలిగా, ఏయన్నార్ కు హీరోయిన్ గా సరోజాదేవి నటించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధం' జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని పాటలు ఈ నాటికీ జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తో బాపు తెరకెక్కించిన 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో సీతమ్మగానూ సరోజాదేవి అలరించారు. రామారావు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం 'సామ్రాట్ అశోక'లోనూ సరోజాదేవికి తగిన పాత్ర నిచ్చి గౌరవించారు. యన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రకాల్లో సరోజాదేవికి తగిన పాత్రలే లభించాయి. యన్టీఆర్ 'జగదేకవీరుని కథ'లో దేవకన్యగా సరోజాదేవిని చూసి నిజంగా మానవమాత్రురాలు కాదనీ ఆ నాటి జనం భావించారు. అంటే సరోజా అందంలోని బంధం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సరోజాదేవి పలు భాషల్లో ఎంతోమంది టాప్ స్టార్స్ తో నటించి మురిపించారు. అయితే ఆమె అభిమాన నటుడు మాత్రం  ఎన్టీఆరేనని పలు మార్లు చెప్పుకున్నారు. అదే తీరున వారిద్దరికీ చిత్ర బంధం కూడా నెలకొనడం విశేషం. 

ఆ ఇద్దరికీ పోలికలు.. 

ఉత్తరాదిన సైతం సరోజాదేవి అందం జనానికి బంధం వేసింది. దిలీప్ కుమార్, వైజయంతీ మాల నటించిన 'పైఘమ్' చిత్రంతో తొలిసారి హిందీ తెరపై వెలిగింది బి.సరోజాదేవి.  వైజయంతీమాలకు, సరోజాదేవికి కొన్ని పోలికలు ఉండడంతో అందరూ వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళు గా భావించేవారు.  ఉత్తరాదిన సైతం బి.సరోజాదేవి అందం చిందులు వేసింది. ఆ నాటి హిందీ సినిమా  టాప్ స్టార్స్ తో సరోజాదేవి జోడీ కట్టి కనువిందు చేశారు. ఈ నాటికీ ఆ సినిమాలను తలచుకొని పరవశించి పోయేవారెందరో!  


ఎన్నెన్నో మేలిమి రత్నాలు 

2009 సంవత్సరం యన్టీఆర్ జాతీయ అవార్డునూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి  సరోజాదేవి అందుకోవడం మరింత విశేషం. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.నాటి అందాల అభినేత్రి సరోజాదేవి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో మేలిమి రత్నాలు. అవి నేటికీ విరజిల్లుతూనే ఉన్నాయి... ఆ కాంతి తరిగిపోదు... సరోజాదేవి కీర్తి కరిగిపోదు.  

Updated Date - Jul 14 , 2025 | 01:14 PM