Samantha: మహిళలు, ఆన్‌లైన్ వేధింపులు.. స్టాండ్ తీసుకున్న సమంత..
ABN, Publish Date - Nov 27 , 2025 | 10:26 AM
మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తుంటారు సమంత . ఇప్పుడు మరోసారి ఆమె మహిళవైపు స్టాండ్ తీసుకున్నారు. మహిళలపై పెరుగుతోన్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్థమైంది
టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఓ రేంజ్‌కు చేరుకున్న సమంతకు (Samantha) ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గాయి. దాంతో నిర్మాణ రంగం వైపు అడుగులేశారు. ఇప్పటికే ఆమె సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘శుభం’తో చక్కని విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram) చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ ఆమె అభిమానులను అలరిస్తుంటారు. అప్పుడప్పుడు పాజిటివ్ కొటేషన్స్ చెబుతుంటారు. ఆరోగ్యానికి సంబందించిన విషయాల్ని పంచుకుంటూ ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపుతుంటారు. అలాగే మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆమె మహిళవైపు స్టాండ్ తీసుకున్నారు. మహిళలపై పెరుగుతోన్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్థమైంది. దీని కోసం ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ ఉమెన్ ఇండియా’తో (UN Women India) చేతులు కలిపింది సమంత. 16 రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ వేఽధింపులను అంతం చేయడమే లక్ష్యంగా పని చేయడానికి సిద్ధమైంది. యూఎన్ ఉమెన్ ఇండియా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉందన్నారు సమంత.
దీనిపై సమంత మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్‌లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నో రకాలుగా మహిళలని వేధింపులకు గురవుతున్నారు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిగా ఈ డిజిటల్ హింస జీవితాలను, నమ్మకాన్ని, భద్రతను ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. గతంలో ప్రత్యక్షంగా జరిగిన ఈ హింస ఇప్పుడు స్ర్కీన్‌ల పైకి వచ్చింది. ఈ చర్యలను మనిషి ఎంతగానో మానసికంగా కుంగదీస్తుంది. పదిమందిలో బాధితుల గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తుంది. నేనూ ఇలాంటి పరిస్థితిని ఎన్నోసార్లు ఎదుర్కొన్నా. ఇలాంటి వాటిపై అవగాహన ఎంతో ముఖ్యం. నేను చేయబోయే ప్రచారా కార్యక్రమ లక్ష్యం ఇదే! ఆన్‌లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు రావాలి’ అని తెలిపారు.