Sai Kumar: 'డైలాగ్ కింగ్' అంటే సాయికుమార్

ABN , Publish Date - Jul 27 , 2025 | 10:21 AM

నటుడు సాయికుమార్ పేరు తలచుకోగానే ఆయన వాచకమే ముందుగా గుర్తుకు వస్తుంది. సాయికుమార్ గళం నుండి జాలువారిన పదాలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాయి.

Sai kumar

నటుడు సాయికుమార్ పేరు తలచుకోగానే ఆయన వాచకమే ముందుగా గుర్తుకు వస్తుంది. సాయికుమార్ గళం నుండి జాలువారిన పదాలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాయి. అందుకే జనం ఆయనను 'డైలాగ్ కింగ్' అన్నారు. 1960 జూలై 27న జన్మించిన సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ తెలుగు సినిమారంగంలో నటునిగా సాగారు. తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ, ఎంతోమంది పరభాషా నటులకు తన వాయిస్ ను అరువిస్తూ శర్మ పయనించారు. అదే తీరున ఆయన పెద్దకొడుకైన సాయికుమార్ సైతం సాగడం విశేషం!


'దేవుడు చేసిన పెళ్ళి' (1975) వంటి చిత్రాల్లో బాలనటునిగా నటించిన సాయికుమార్ తరువాత బాపు 'స్నేహం' (1977)లో గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. ఆ తరువాత సాయికుమార్ కు పెద్దగా గుర్తుండిపోయే పాత్రలేవీ లభించలేదు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి ఎమ్.ఏ. పట్టా పుచ్చుకున్నారు సాయి. తరువాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో ఎమ్.ఫిల్ కూడా చేశారు. తెలుగు చిత్రాల్లో లభించిన పాత్రలన్నిటా నటించేవారు. దాంతో కాసింత గుర్తింపు సంపాదించారు. కానీ, సరైన బ్రేక్ లభించలేదు. ఓ వైపు కన్నడ చిత్రాల్లోనూ, మరోవైపు తమిళ సినిమాల్లోనూ నటించారు. కన్నడలో సాయికుమార్ హీరోగా రూపొందిన 'పోలీస్ స్టోరీ' (1996) మంచి విజయం సాధించింది. దాంతో అక్కడ వరుసగా పలు సినిమాల్లో పోలీస్ రోల్స్ పోషించి స్టార్ హీరో అయిపోయారు.


తెలుగులోనూ సాయికుమార్ కు కొన్ని సినిమాల్లో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. తన చిన్న తమ్ముడు అయ్యప్ప పి.శర్మ దర్శకత్వంలో 'ఈశ్వర్ అల్లా' సినిమా నిర్మించారు సాయి. ఆయన పెద్ద తమ్ముడు రవిశంకర్ కూడా బాలనటునిగా రాణించి, తరువాత అన్నలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరించారు. ఆ పై విలన్ కేరెక్టర్స్ లోనూ ఆకట్టుకున్నారు రవిశంకర్.

ప్రస్తుతం సాయికుమార్ కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు. ఒకప్పుడు సుమన్, రాజశేఖర్, రజనీకాంత్ వంటి నటులకు తన గాత్రంతో వారి పాత్రలకు వన్నె తీసుకు వచ్చారు సాయికుమార్. తాను నటునిగా బిజీ అయిన తరువాత సాయికుమార్ డబ్బింగ్ అంతగా చెప్పడం లేదు. అయినా ఈ నాటికీ సాయికుమార్ అనగానే తెలుగు ప్రేక్షకులు 'డైలాగ్ కింగ్' అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో రాజకీయాల్లోనూ కొంతకాలం పయనించిన సాయి కుమార్ ప్రస్తుతం పూర్తిగా నటనలోనే సాగుతున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 10:27 AM