The Great Pre Wedding Show: టీజర్ విడుదల చేసిన రౌడీ స్టార్...
ABN, Publish Date - Sep 17 , 2025 | 09:35 AM
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న తిరువీర్ తాజా చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కాబోతోంది.
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer), టీనా శ్రావ్య (Teena Sravya) జంటగా నటిస్తున్న సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre Wedding Show). సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మిస్తున్న ఈ సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 7న సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ను మంగళవారం సోషల్ మీడియా ద్వారా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) విడుదల చేశారు. విజయ్ దేవరకొండ... తిరువీర్ గురించి చెబుతూ, 'ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని ప్రశంసించారు.
‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేశారు. ‘అరే ఈ లైట్ అక్కడ పెట్టు’ అంటూ హీరోయిన్ ముందు హీరో చేసే హడావుడి.. దానికి ఆమె భయపడే తీరు, ‘ఎవండీ మీ ఫొటో తీసుకుని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా’ అని హీరోయిన్‌ని హీరో అడగటం.. దానికి హీరోయిన్ ‘నా ఫొటో ఎందుకు’ అని అడగటం.. దానికి సమాధానంగా హీరో ‘అంటే మీరు బావుంటారు కదా’ అని సమాధానం చెబుతాడు. దానికి హీరోయిన్ ‘ఏశావులే సోపు’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం వంటి డైలాగ్స్ చూస్తుంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండవచ్చుననే విషయం తెలుస్తుంది. ఓ సందర్భంలో హీరో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒప్పుకోవటం.. పెళ్లి కూతురు తల్లి కండీషన్స్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు... టీజర్ చివరలో హీరో తన అసిస్టెంట్‌తో ‘ఈ డ్రెస్ బావుందారా’ అని అడిగితే ‘హీరోలా ఉన్నావన్నా’ అని అసిస్టెంట్ అంటే హీరో ఏమో షాక్ కావటం వంటి ఫన్నీ సీన్స్ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పారు మేకర్స్. తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతున్నాయి. నరేష్ అడుప ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.