సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramakrishna Goud: అప్పుడు ఎన్టీఆర్ 'దీక్ష'... ఇప్పుడు 'ఆర్.కె. దీక్ష'

ABN, Publish Date - Dec 22 , 2025 | 06:10 PM

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఆర్.కె. దీక్ష'. ఈ సినిమా కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

RK Deeksha Movie

ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'ఆర్.కె. దీక్ష' (RK Deeksha). అక్సాఖాన్ (Aqsa Khan), అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) హీరోయిన్లుగా, కిరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు బి.ఎస్. రెడ్డి సమర్పకుడు. తులసీ, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. రాజ్ కిరణ్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు మేగన శ్రీను ఎడిటర్. అతి త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో న్యూ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ గారి చిత్రం పేరును తీసుకుని ఆయన ఆశయాలతో 'ఆర్.కె. దీక్ష' సినిమాను తీయడం జరిగింది. అటువంటి గొప్ప ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నటి అక్సా ఖాన్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగిన విషయం. ప్రస్తుతం చిన్న సినిమాల మనుగడకు చాలా కష్టంగా ఉంది. దాసరి నారాయణరావు గారు చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ, టికెట్ ధరలు తక్కువలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. గతంలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ వంటి వారు సినీ పరిశ్రమకు ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు బ్రతకాలి, అప్పుడే అందరూ బావుంటారు. రామారావు గారి ఆశీస్సులతో 'ఆర్.కె. దీక్ష' చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'అన్న ఎన్టీఆర్ గారు 50 సంవత్సరాల క్రితం చేసిన 'దీక్ష' అనే టైటిల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. ఇప్పటికే అనేక సినిమాలు తీసాను. కాని కొన్ని సంవత్సరాల నుండి లీజు పద్ధతిలో సినిమాలు థియేటర్లలో నడపడం వల్ల చిన్న సినిమాలు, నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనిని కచ్చితంగా అరికట్టే మార్గంలో ప్రసన్న కుమార్ గారు, తదితరులు ప్రయత్నిస్తున్నారు. చిన్న నిర్మాతలకు డిజిటల్ చార్జెస్ మరింత భారంగా మారింది. గతంలో ఇలా ఉండేది కాదు, ప్రస్తుతం దోపిడి పెరిగిపోయింది. ఇలాగే ముందుకు కొనసాగితే సినిమాలు చేయడం కష్టం అవుతుంది. ఇప్పటికి అయినా ఈ సినిమాతో డిజిటల్ ఛార్జ్ లు తగ్గించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు డి.ఎస్. రెడ్డి, నటీనటులు అక్సాఖాన్, కిరణ్‌, గురురాజ్, సాయి వెకంట్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 06:10 PM