Jr NTR: కాంతార లాంటి.. సినిమా తీయడం మామూలు విషయం కాదు
ABN, Publish Date - Sep 29 , 2025 | 06:13 AM
జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార: ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని, ఈ చిత్రం గొప్ప బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘నా బాల్యంలో మా అమ్మమ్మ కొన్ని కథలు చెప్పారు. అవి నా కెంతో బాగా నచ్చేవి. ఆ కథల నుంచి ఓ దర్శకుడు ‘కాంతార’ లాంటి గొప్ప ‘సినిమా తీస్తాడని నేను ఏ రోజూ ఊహించలేదు. నా సోదరుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ‘కాంతార: ఛాప్టర్ 1’ (Kantara Chapter 1) కోసం ఆయన పడిన కష్టం నేను కళ్లారా చూశాను. ఇలాంటి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఒక గొప్ప బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది’ అని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు.
రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించిన ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రిషబ్ అరుదైన నటుడు, దర్శకుడు. 24 విభాగాలను డామినేట్ చేయగల ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. ఈ చిత్రం మనందరినీ రంజింపచేస్తుంది. ఈ సినిమాను ఆదరించి, రిషబ్ కష్టానికి మీ ఆశీర్వాదాలు అందజేయండి’ అని అభిమానులను కోరారు.
రిషబ్‌శెట్టి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం సంతోషాన్నిచ్చింది. ‘కాంతార’ చిత్రానికి గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలి’ అని ప్రేక్షకులను కోరారు. ‘కాంతార 1’లో కీలకమైన పాత్ర పోషించాను, ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది అని కథానాయిక రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తెలిపారు.