సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jagannath: సినిమా నచ్చకపోతే.. గల్లా పట్టుకుని అడగండి

ABN, Publish Date - Nov 26 , 2025 | 12:07 PM

రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్‌ మూవీ డిసెంబర్ 19న విడుదల కాబోతోంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని భరత్ చెబుతున్నాడు.

Jagannath Movie

ఈ మధ్య కాలంలో ఫిల్మ్ మేకర్స్ తమ చిత్రాలను గురించి ఇస్తున్న స్టేట్ మెంట్స్ హద్దులు మీరుతున్నాయి. సినిమా ఖచ్చితంగా జనాలకు నచ్చుతుందని ఒక వేళ నచ్చకపోతే 'అలా చేయండీ... ఇలా చేయండీ' అని మేకర్స్ చెబుతున్నారు. కొందరైతే 'మీరు మా సినిమాను తిరస్కరిస్తే అలా చేస్తాం... ఇలా చేస్తాం' అంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాబు' (Raju Wed Rambai) చిత్ర దర్శకుడు సాయిలు సైతం తన సినిమా ఎవరికైనా నచ్చలేదని చెబితే అమీర్ పేట చౌరస్తాలో డ్రాయర్ తో తిరుగుతానని శపథం చేశాడు. అదృష్టం బాగుండి... ఆ సినిమాకు మంచి ఆదరణే ప్రేక్షకుల నుండి లభించింది. దాంతో ఆ తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో తను కొత్త దర్శకుడినని, వేదికల మీద మాట్లాడటం రాదని, ఎవరి మనసునైనా తన మాటల ద్వారా నొప్పించి ఉంటే క్షమించమని సాయిలు కోరాడు. మొత్తం మీద నిర్మాతలు, పంపిణీ దారులు, హీరోలు సైతం ఇలాంటి మాటలు సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చెప్పడం సహజంగా మారిపోయింది. నూతన కథానాయకుడు రాయలసీమ భరత్ కూడా అదే జాబితాలో చేరిపోయాడు. అతను హీరోగా 'జగన్నాథ్‌' (Jagannath) అనే సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ వీడియో చేసి, అందులో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. పనిలో పనిగా తన సినిమా నచ్చకపోతే ఇంటికొచ్చి గల్లా పట్టుకుని అడగమనీ చెప్పేశాడు.


భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్, సంతోష్ దర్శకత్వంలో 'జగన్నాథ్‌' సినిమా రూపుదిద్దుకుంది. రాయలసీమ భరత్ (Rayalaseema Bharath), ప్రీతిరెడ్డి జంటగా నటించిన ఈ సినిమాలో నిత్యశ్రీ, సారా ఆచార్, సమ్మెట గాంధీ, సత్యప్రకాశ్‌, బాహుబలి ప్రభాకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ సినిమా టీజర్ ను మంచు మనోజ్ (Manchu Manoj) ఆవిష్కరించాడు. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని పీలం పురుషోత్తమ్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు నాలుగేళ్ళ సమయం పట్టిందని, జీవితకాలపు అనుభవాన్ని దీని నిర్మాణ సమయంలో తాను పొందానని, అయినవాళ్ళు ఎవరో, కానివాళ్ళు ఎవరో ఈ కష్టకాలంతో తనకు తెలిసిందని చెబుతూ రాయలసీమ భరత్ కన్నీటి పర్యంతమయ్యాడు. యాక్షన్ ప్రియులకు తన సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని, లేదంటే తన ఇంటికొచ్చి గల్లా పట్టుకుని అడొచ్చని అన్నాడు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న 'జగన్నాథ్‌' మూవీని డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా రాయలసీమ భరత్ భుజం తట్టేలా ఉంటుందా? గల్లా పట్టి నిలదీసేలా ఉంటుందా? అనేది చూడాలి.

Also Read: Tollywood: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల తేదీ ఖరారు

Also Read: NBK111: బాల‌య్య‌.. మ‌హారాజు షురూ! ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్‌

Updated Date - Nov 26 , 2025 | 01:17 PM