Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:45 AM
మాస్ మహారాజా రవితేజ ఈసారి ఒక విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఈసారి ఒక విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulu Vignapthi). వైవిధ్యమైన కథాంశాలను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లుగా మలచడంలో దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Thirumala) దిట్ట. 'నేను శైలజ'(Nenu Sailaja), 'ఉన్నది ఒకటే జిందగీ'(Unnadhi Okkate Zindagi), 'ఆడవాళ్లు మీకు జోహార్లు'(Aadavallu Meeku Johaarlu) వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన కిషోర్, ఈసారి రవితేజను ఒక కొత్త కోణంలో చూపించబోతున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు, కిషోర్ తిరుమల మార్క్ ఎమోషన్స్ తోడైతే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక చాలా రోజులుగా ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ 19న(శుక్రవారం) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో రవితేజ లుక్ క్లాస్ గా ఉంటూనే, మాస్ ఎనర్జీని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయతి(Dimple Hayati), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక 'ధమాకా'(Dhamaka), 'మాస్ జాతర'(Mass Jathara) వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ను అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన ఇచ్చే మాస్ బీట్స్, మెలోడీలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్(Sri Lakshmi Venkateswara Cinemas banner) పై నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేలా సినిమాను ప్లాన్ చేశారు. విభిన్నమైన టైటిల్, క్రేజీ కాంబినేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిసిన ఈ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజకు మంచి హిట్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.