సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Veera Chandrahasa: అక్క‌డ‌ వంద రోజులు ఆడింది.. ఇప్పుడు తెలుగులో థియేట‌ర్ల‌కు వ‌స్తోంది

ABN, Publish Date - Sep 10 , 2025 | 06:09 PM

కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ‘వీర చంద్రహాస’ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Veera Chandrahasa

కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ‘వీర చంద్రహాస’ (Veera Chandrahasa)చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ నేతృత్వంలోని కంచి కామాక్షి, కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో ప్రత్యేకంగా నిలిచిన రాధాకృష్ణ, గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో విడుదల చేసి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగిస్తూ వీర చంద్రహాస తెలుగు రైట్స్‌ పొందారు.

ఈ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్ (Ravi Basrur), కేజీయఫ్, సలార్ వంటి యాక్షన్ సినిమాలకు అందించిన సంగీతంతో ఇప్పటికే సంచలనంగా మారారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వీర చంద్రహాసలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ వంటి ప్రతిభావంతులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) సమర్పణలో సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహ’ చిత్రం ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించగా, అదే తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

పురాణ నేపథ్యం.. యక్షగానం వైభవం

వీర చంద్రహాస కథ మహాభారతంలోని అశ్వమేధిక పర్వం ఆధారంగా సాగుతుంది. ఒక అనాథ యువకుడు ఎలా పరాక్రమవంతుడిగా, సద్గుణ సంపన్నుడిగా ఎదిగాడో చూపించే కథ ఇది. ముఖ్యంగా సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం కళారూపాన్ని పూర్తిగా వెండితెరపై ఆవిష్కరించడం విశేషం. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.

నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ..

“కన్నడలో విడుదలైన వీర చంద్రహాస మంచి వసూళ్లతో పాటు హిట్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఇది కూడా విజయాన్ని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మాకు మరింత గర్వంగా ఉంది” అన్నారు.

సంగీత దర్శకుడు, దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ..

“కన్నడ ప్రేక్షకులు మా చిత్రాన్ని ఎంతో ఆదరించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది నచ్చుతుందని నమ్ముతున్నాను. శివరాజ్ కుమార్ గారు, ఇతర నటీనటులంతా ఎంతో మంచి సపోర్ట్ ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు. ఇప్పుడు ఎమ్‌వీ రాధాకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులకు గ్రాండ్‌గా విడుదల చేయడం ఆనందంగా ఉంది,” అన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 06:09 PM