Allu Aravind: రష్మికకు.. ఈ సినిమాతో అవార్డు ఖాయం! ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి.. విజయ్ దేవరకొండ
ABN, Publish Date - Oct 26 , 2025 | 05:58 AM
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్ రోల్‌లో రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). దీక్షిత్ శెట్టి (Dikshit Shetty) కథానాయకుడు. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్లపై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఓ ప్రత్యేక వేడుక నిర్వహించిన ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. రష్మిక మాట్లాడుతూ ‘ఈ చిత్రం కథ విన్నప్పుడు ఇప్పటివరకూ ఇలాంటి ప్రేమ కథని మనం చూడలేదనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అని అనిపించింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. నా కెరీర్‌లో సరైన సమయంలో సరైన ఎంపిక ఈ ప్రాజెక్టు’ అని అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ‘నేను విద్యార్థిగా హాస్టల్‌లో ఉండే రోజుల్లో అనుకున్న కథ ఇది. ట్రైలర్‌లో చూపించినట్లే సినిమా ఆధ్యంతం మనసును కదిలించే భావోద్వేగాలతో ఉంటుంది. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఈ చిత్రం తర్వాత ఆయన టాలీవుడ్‌లో మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు’ అని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఈ ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు.‘ఆహా’కు వెబ్ సిరీస్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. కానీ, ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించింది. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అలాంటి పాత్రకు రష్మిక (Rashmika mandanna) మాత్రమే న్యాయం చేయగలదు అని అనిపించింది. తను నాకు కూతురు లాంటిది. ఈ సినిమాలో నటనకు గాను రష్మికకు ఉత్తమ నటి అవార్డు రావడం ఖాయం’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. వీలుంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండను పిలుద్దామని అన్నారు.