Mysaa: రష్మిక.. నెవర్ బిఫోర్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్టార్ట్
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:20 PM
రష్మిక మందన్నా లీడ్ రోల్‌లో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ ఘనంగా ప్రారంభమైంది. గోండు తెగ నేపథ్యంతో ఈ సినిమా రూపొందనుంది.
భారీ బడ్జెట్ చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస సక్సెస్‌లు సాధిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) లీడ్ రోల్‌లో కొత్త తెలుగు చిత్రం ‘మైసా’ (Mysaa) ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను UnFormula Films నిర్మిస్తోంది. ‘సీతారామం’, ‘ఫౌజీ’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె (Rawindra Pulle) ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఔట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది.
తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో అధికంగా నివసించే ప్రముఖ ఆదివాసి జాతి గోండు తెగ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. భయమెరగని ఓ వీరనారి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ క్రియేట్ చేశాయి. రష్మిక లుక్ పోస్టర్‌లో స్టన్నింగ్‌గా ఉండటం విశేషం.
ఈ సినిమాను మేకర్స్ తెలుగు తో పాటు పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. ‘కల్కి’ వంటి భారీ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఆండీ లాంగ్ (Andy Long) ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. అలాగే, ‘సూర్య రేట్రో’ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన శ్రేయాస్ పి కృష్ణ (Shreyaas P Krishna) ఈ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆదివారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమానికి హను రాఘవపూడి, దగ్గుబాటి సురేశ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మొదటి షాట్‌కు క్లాప్ కొట్టగా, విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ‘రౌడీ జనార్థన్’ దర్శకుడు రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనంతరం రష్మిక అక్కడికి వచ్చిన గోండు జాతి మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం కూడా చేశారు.
ఇటీవలే ‘ఛావా’, ‘కుబేర’ చిత్రాలతో భారీ విజయాలను సాధించిన రష్మిక, తెలుగులో ‘అందాల రాక్షసి’ ఫేమ్ హీరో మరియు జాతీయ అవార్డు పొందిన ‘చిలసౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లకు రానుంది.