Rana Daggubati: చిరకాల కోరిక తీర్చుకోబోతున్న రానా...

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:54 PM

రానా దగ్గుబాటి దర్శకుడు కావాలనే తన చిరకాల కోరికను త్వరలోనే తీర్చుకోబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 14న ఆయన వెల్లడించబోతున్నాడు.

Rana Daggubati

మూవీ మొఘల్ రామానాయుడు (Ramanaidu) పెద్ద మనవడు రానా (Rana) మొత్తానికీ తన చిరకాల కోరికను తీర్చుకోబోతున్నాడు. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేశ్‌ బాబు (Suresh Babu) ఇద్దరు పిల్లల్లో పెద్దవాడైన రానా ను దర్శకుడిని, చిన్న వాడైన అభిరామ్ (Abhiram) ను హీరోను చేయాలని అనుకున్నారు. ఎందుకంటే తన కొడుకులిద్దరిలో సురేశ్‌ నిర్మాత కాగా వెంకటేశ్‌ (Venkatesh) హీరో. ఇద్దరూ ఎప్పుడూ మెగా ఫోన్ పట్టాలని అనుకోలేదు. అయితే రామానాయుడుకు మాత్రం చివరి వరకూ ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలనే కోరిక ఉండేది. కానీ దానిని తీర్చుకోకుండానే ఆయన కన్నుమూశారు.

రానా ను డైరెక్టర్ గా చూడాలని రామానాయుడు అనుకోవడానికి కారణం లేకపోలేదు. చిన్న వయసు నుండే రానా దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. కొన్ని డాక్యుమెంటరీలనూ తీశాడు. దాంతో ఎప్పటికైనా రానా మంచి దర్శకుడు అవుతాడని రామానాయుడు భావించారు. కానీ చిత్రంగా 'లీడర్' మూవీతో రానా హీరో అయిపోయాడు. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనకు నచ్చిన పనిని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలానే రానా తమ్ముడు అభిరామ్ 'అహింస' మూవీతో హీరో అయ్యాడు.


తాజాగా దుల్కర్ సల్మాన్ తో కలిసి రానా 'కాంత' సినిమాలో నటించాడు. అంతే కాదు దుల్కర్ తో పాటు దీనిని నిర్మించాడు. ఇందులో రానా నటుడిగా కొన్ని సినిమాలను వదులు కున్నాడు కూడా. ఈ నెల 14న 'కాంత' తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రానా దర్శకుడు కావాలనే తన కోరిక గురించి చిత్రజ్యోతితో ముచ్చటించాడు. వచ్చే నెల 14న తాను దర్శకత్వం వహించే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేస్తానని చెప్పాడు. నటుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా సినిమా రంగం గురించి పూర్తి అవగాహన ఉన్న రానా మెగాఫోన్ పడితే... అది ఖచ్చితంగా ఓ ల్యాండ్ మార్క్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

రానా దర్శకత్వం వహించే సినిమాను ఓన్ బ్యానర్ లో చేస్తాడా? బయటి నిర్మాణ సంస్థలో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అలానే తాను డైరెక్ట్ చేసే సినిమాలో రానా నటిస్తాడా? లేకపోతే కేవలం దర్శకత్వానికే పరిమితం అవుతాడా? అన్నది చూడాలి. ఏదేమైనా... రానా దర్శకుడిగా మారడమన్నది దగ్గుబాటి కుటుంబానికి సంబంధించినంత వరకూ అత్యంత ఆనందకరమైన వార్తే!

Also Read: Theater Movies: ఈ శుక్ర‌వారం.. థియేట‌ర్ సినిమాలు! ఒక‌టి కాదు 70

Also Read: The Kerala Story: అదా శర్మ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 13 , 2025 | 02:59 PM