Rama Satyanarayana: ప్రపంచ రికార్డ్ కోసం 15 చిత్రాలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 06:04 PM
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకంగా ఆరు కొత్త రికార్డులను అందుకోవడానికి శ్రీకారం చుట్టారు. ఒకే రోజున పదిహేను సినిమాలను ఆయన ప్రారంభించబోతున్నారు.
మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు (D. Ramanaidu) తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన తెలుగు వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా భీమవరం టాకీస్ (Bheemavaram Talkies) అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Thummalapalli Rama Satyanarayan) నిలిచారు. తాజాగా ఆయన ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ కొత్త రికార్డ్ సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 15 తేదీన ఏకంగా పదిహేను చిత్రాలను ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ (Saradhi Studios) వేదిక కానుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన పదిహేను చిత్రాలను పదిహేనుమంది దర్శకులతో, పదిహేను కెమెరాలతో ప్రారంభించబోతున్నారు. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు.
ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'ఇది ఇంతవరకూ ఎవరూ ఆలోచించడానికి కూడా సాహసించని విషయం. ఒకేసారి పదిహేను కధలను, పదిహేను సినిమాలుగా తీయబోతున్నాం. పదిహేను మంది దర్శకులు ఈ సినిమాలను తెరకెక్కిస్తారు. పదిహేను కెమెరాలతో షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా ఆరు సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నాం. భారత్ వరల్డ్ రికార్డ్స్, ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిరవ్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రిజిస్టర్ చేశాం' అని అన్నారు. కాగా గతంలో నందమూరి తారకరత్న ఇలానే హీరోగా పరిచయం అవుతూ ఒకే రోజున తొమ్మిది చిత్రాలను మొదలు పెట్టారు. అయితే అందులో కొన్ని మాత్రమే పూర్తి అయ్యి జనం ముందుకు వచ్చాయి. మరి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ పదిహేను చిత్రాలు ఎప్పటిలోగా షూటింగ్ పూర్తి చేసుకుంటాయి, ఎప్పుడు విడుదల అవుతాయన్నది వేచి చూడాలి.
Also Read: Jamie Lever: అతను వీడియో కాల్ లో బట్టలు విప్పమన్నాడు
Also Read: Mahavatar Narsimha: ‘మహావతార్ నరసింహ’ ఎలా ఉందంటే