సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramajogayya Sastry: రంజింప చేస్తోన్న రామజోగయ్య శాస్త్రి

ABN, Publish Date - Aug 23 , 2025 | 06:11 PM

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీగా సాగుతున్న గీత రచయిత ఎవరంటే రామజోగయ్య శాస్త్రి (Rama Jogayya Sastry) పేరే వినిపిస్తుంది. ఆయన కలం నుండి జాలువారిన అనేక గీతాలు ప్రేక్షకులను విశేషంగా రంజింప చేశాయి.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీగా సాగుతున్న గీత రచయిత ఎవరంటే రామజోగయ్య శాస్త్రి (Rama Jogayya Sastry) పేరే వినిపిస్తుంది. ఆయన కలం నుండి జాలువారిన అనేక గీతాలు ప్రేక్షకులను విశేషంగా రంజింప చేశాయి. స్టార్ హీరోస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారి సినిమాల్లో రామజోగయ్య పలికించిన పాటలు సదరు హీరోల ఫ్యాన్స్ ను పులకింప చేస్తూ ఉన్నాయి. "ఓమ్ నమో శివరుద్రాయా..." (ఖలేజా) అని భక్తి పారవశ్యం పెంచినా, "జై బాలయ్యా..." (వీరసింహారెడ్డి) అంటూ బాలకృష్ణ అభిమానులు ఆనందించేలా చేసినా, "ఎత్తర జెండా..." (ట్రిపుల్ ఆర్) అని ఇద్దరు మాస్ హీరోలు జూ.యన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో చిందులేయించినా, "బుట్ట బొమ్మా..." (అల వైకుంఠపురములో...) అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కు సంతోషం పంచినా- అదంతా రామజోగయ్య కలం బలం అని చెప్పక తప్పదు. అడపాదడపా తెరపై కూడా కనిపించి నటునిగా ఆనందం పొందుతుంటారు రామజోగయ్య.

నరసరావు పేట సమీపంలోని ఆరేపల్లి ముప్పాళ్ళలో 1970 ఆగస్టు 24న దరివేముల రామజోగయ్య శాస్త్రి జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ రామజోగయ్య శాస్త్రికి గాయకుడు కావాలన్న అభిలాష ఉండేది. నచ్చిన పాటలన్నీ ఓ పుస్తకంలో రాసుకొని, మరీ వాటిని సంపాదించి విని ఆనందించేవారు. అంతేకాదు ఆ పాటల్లోని సాహిత్యాన్ని కూడా భట్టీయం వేసి పాటలు పాడుతూ మిత్రులను ఆనందింప చేసేవారు. వరంగల్ ఎన్.ఐ.టి.లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రామజోగయ్య ఖరగ్ పూర్ ఐఐటీలో ఎమ్.టెక్, చేశారు. మద్రాసులో ఉద్యోగం వస్తే సినిమా గాయకుడు కావచ్చునని కలలు కన్నారు. అయితే బెంగళూరులో రామజోగయ్యకు ఉద్యోగం లభించింది. అక్కడ కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాతను పరిచయం చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతో గాయకుడు కావాలని ఆశించారు. అయితే రామజోగయ్యకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేనందున ముందు గీతరచనపై దృష్టి సారించమని వారు సలహా ఇచ్చారు. దాంతో భక్తిగీతాలు రాయడం మొదలెట్టారు. రామజోగయ్య రాసిన భక్తి పాటలు దాదాపు నలభై క్యాసెట్స్ లో వెలువడ్డాయి.


హైదరాబాద్ మకాం మార్చాక సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన 'యువసేన' లో తొలిసారి రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. ఆరంభంలో రామజోగయ్య పాటలు రాసిన చిత్రాలు అంతగా అలరించలేదు. కానీ, ఆయన పాటల్లోని భావం సాహిత్యాభిమానులను మురిపించింది. దాంతో రామజోగయ్య ప్రతిభకు పట్టం కడుతూ పలువురు దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు అవకాశాలు కల్పిస్తూ సాగారు. స్టార్ హీరోస్ మూవీస్ లో రామజోగయ్య రాసిన పాటలు క్లిక్ కావడంతో ఆయన మరి వెనుతిరిగి చూసుకోలేదు. 'శ్రీమంతుడు' (2015)లోని "పోరా శ్రీమంతుడా..." పాటతోనూ 'జనతా గ్యారేజ్' (2016)లోని "ప్రణామం... ప్రణామం..." అంటూ సాగే పాట ద్వారా వరుసగా రెండేళ్ళు నంది అవార్డుకు ఎన్నికయ్యారు రామజోగయ్య. "ఖలేజా, జనతా గ్యారేజ్, అంటే సుందరానికి" చిత్రాల ద్వారా బెస్ట్ లిరిసిస్ట్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డులూ అందుకున్నారు. ఏది ఏమైనా తెలుగునాట ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి తన గీత రచనతో సాహిత్యాభిమానులను పులకింప చేస్తున్నారని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లోనూ రామజోగయ్య కలం ఇదే తీరున అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - Aug 23 , 2025 | 06:16 PM