Ram Vs Keethy: రామ్ - కీర్తి మధ్య బాక్సాఫీస్ వార్...
ABN, Publish Date - Nov 10 , 2025 | 01:57 PM
'నేను - శైలజ' చిత్రంలో జంటగా నటించిన రామ్ పోతినేని, కీర్తి సురేశ్ మళ్ళీ ఇంతవరకూ కలిసి నటించలేదు. అయితే రామ్ నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా', కీర్తి సురేశ్ నటించిన 'రివాల్వర్ రీటా' సినిమాలు ఒకే రోజున విడుదల అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ (Keethy Suresh) కెరీర్ కొంత కాలంగా డోల్ డ్రమ్స్ లో ఉంది. ఏ భాషలోనూ ఆమె సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దాంతో కొన్ని మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్స్ దారిపడితే, మరి కొన్ని సినిమాల విడుదల ఊహించని విధంగా డిలే అవుతోంది. అలా అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన 'రివాల్వర్ రీటా' (Revolver Rita) మూవీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. చాలామంది ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో వచ్చేసిందనే భావనలో ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ డేట్స్ చాలా సార్లు మారాయి. మరికొన్ని సార్లు ఓటీటీలో వస్తున్నట్టుగానూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడీ సినిమాను నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. 'రివాల్వర్ రీటా'ను తెలుగు, తమిళ భాషల్లో కె. చంద్ర డైరెక్ట్ చేశాడు. ఇందులో రాధికా శరత్ కుమార్ (Radhika Sarathkumar) కీలక పాత్ర పోషించగా, జాన్ విజయ్ (John Vijay), అజయ్ ఘోష్ (Ajay Ghosh), రెడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఈ యాక్షన్ బేస్డ్ కామెడీ సినిమాను పేషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.
ఇదిలా ఉంటే... నవంబర్ 28న 'రివాల్వర్ రీటా' పోటీ పడుతోంది తన తొలి తెలుగు చిత్ర కథానాయకుడు రామ్ పోతినేని మూవీతో! కీర్తి సురేశ్ తొలి తెలుగు సినిమా 'నేను శైలజ'. నిజానికి ఈ సినిమాకంటే ముందే సీనియర్ నటుడు నరేశ్ కొడుకు నవీన్ మూవీలో కీర్తి సురేశ్ నటించింది కానీ అది విడుదలకు నోచుకోలేదు. దాంతో కీర్తి సురేశ్ కు 'నేను శైలజ' ఫస్ట్ తెలుగు మూవీ అయ్యింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రామ్, కీర్తి సురేశ్ జంటను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. దాదాపు పదేళ్ళ క్రితం వచ్చిన 'నేను శైలజ' (Nenu Sailaja) అంత పెద్ద హిట్ అయినా ఆ తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni), కీర్తి సురేశ్ కలిసి నటించలేదు. కానీ వీరిద్దరూ విడివిడిగా నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. రామ్ పోతినేని సైతం కొంతకాలంగా పరాజయాలతోనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అతని తాజా చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Thaluka) మూవీ నవంబర్ 28న వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్రను పోషించాడు. ఇప్పుడు నవంబర్ 28నే రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' రావడం కాకతాళీయం అనుకోవాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కొత్త సినిమా...
Also Read: Dandora: అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగితే..