Ram Charan: నాకు మగధీర.. రోషన్‌కు ఛాంపియన్
ABN, Publish Date - Dec 19 , 2025 | 05:30 AM
నా రెండో సినిమా ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ‘ఛాంపియన్’ కూడా అంత పెద్ద విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నా అని రామ్‌చరణ్ అన్నారు.
‘‘స్టూడెంట్ నెంబర్ వన్’తో జూ. ఎన్టీఆర్‌ను, ‘గంగోత్రి’తో అల్లు అర్జున్‌ను, ‘రాజకుమారుడు’తో మహేశ్ బాబును, ‘చిరుత’తో నన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు నిర్మాత అశ్వనీదత్ గారు. మా అందరికీ మొదటి సినిమాతో అద్భుతమైన ప్రయాణాన్నిచ్చిన అశ్వనీదత్ గారికి కృతజ్ఞతలు. ‘ఛాంపియన్’ (Champion) తో వస్తున్న రోషన్‌కు వైజయంతీ మూవీస్‌లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. పోస్టర్‌లో రోషన్‌ని చూస్తుంటే ఒక హాలీవుడ్ యురోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు’ అని కొనియాడారు కథానాయకుడు రామ్‌చరణ్ (Ram Charan).
రోషన్ (Roshan), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ప్రదీప్ అద్వైతం (Pradeep) రూపొందించిన చిత్రం ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా ఈనెల 25న విడుదలవుతోంది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ నా రెండో సినిమా ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ‘ఛాంపియన్’ కూడా అంత పెద్ద విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటెంట్ చూస్తుంటే ఒక క్లాసిక్‌లాగా అనిపిస్తోంది’ అని అన్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘వైజయంతీ మూవీస్ సంస్థ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రదీప్ గారు చాలా ముఖ్యమైన కథ చెబుతున్నారు. బైరాన్‌పల్లి వీరుల ప్రతిభ మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ ‘నేను పరిచయం చేసిన రామ్‌చరణ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. రోషన్ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ప్రదీప్ అద్వైతం, రోషన్, అనస్వర రాజన్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.