Raghava Lawrence: నిన్ను ఒక్కసారి కలవాలి.. నా దగ్గరకు రా
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:49 PM
మానవసేవనే మాధవ సేవ అని పెద్దలు నేర్పిస్తారు. కానీ, ఈ కాలంలోఏది ఆశించకుండా సహాయం చేసే మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు.
Raghava Lawrence: మానవసేవనే మాధవ సేవ అని పెద్దలు నేర్పిస్తారు. కానీ, ఈ కాలంలోఏది ఆశించకుండా సహాయం చేసే మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క చిన్న సహాయం చేసినా.. బోల్డంత పబ్లిసిటీ చేసుకొనే ఈరోజుల్లో నిస్వార్థంగా పేదలకు, సహాయం అన్నవారికి అండగా నిబడినవాడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు లారెన్స్. ఇక నటుడుగానే కాకుండా ఒక గొప్ప మనసు ఉన్న మనిషిగా ఆయన మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు. కాళ్లు చేతులు లేనివారికి, అనాధ పిల్లలకు.. సాయం అన్నవారికి ఆపన్న హస్తం ఇస్తూ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా కొనసాగుతున్నాడు.
23 Movie: దళితులకు అన్యాయం.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా
ఇక తాజాగా మరోసారి రాఘవ లారెన్స్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ కన్నీటి గాధ గురించి అందరికీ తెల్సిందే. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాలో.. ఏ సత్తి.. బాలు ఇటు వచ్చిందా అని అడిగే పిల్లాడు గుర్తున్నాడు కదా. అతడే రవి రాథోడ్. ఆ తరువాత 42 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన అతని తల్లిదండ్రులు మంటల్లో కాలిపోయారు. ఆ తరువాత అనాధగా పెరిగిన రవి.. మద్యానికి బానిసగా మారి సెట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. ఇక అతడిని కొంతమంది గుర్తుపట్టి.. చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని చెప్పడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అతడిని ఇంటర్వ్యూ చేశాయి.
ఇక ఆ ఇంటర్వ్యూలో రవి.. తన మనోగతాన్ని మొత్తం బయటపెట్టాడు. ఏఏ సినిమాలు చేశాడు..? తల్లిదండ్రులు ఏమయ్యారు.. ? తాగుబోతుగా ఎందుకు మారాడు.. ? అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు. అతడి కన్నీటి గాధ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు అని చెప్పొచ్చు. ఇక ఆ ఇంటర్వ్యూలోనే రవి.. రాఘవ లారెన్స్ గురించి చెప్పుకొచ్చాడు. మాస్ సినిమా సమయంలో లారెన్స్ సర్ .. ఒక స్కూల్ లో చేర్పించారు. కొన్నిరోజులు అక్కడ నుంచి పారిపోయాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఎంతోమందికి సహాయం చేసే లారెన్స్.. నీకు కూడా సహాయం చేస్తాడు.. ఆయన దగ్గరకు వెళ్లు అని యాంకర్ చెప్తే.. లారెన్స్ సర్.. స్కూల్ నుంచి పారిపోయినందుకు నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అందుకు సంబంధించిన వీడియో చివరకు లారెన్స్ వద్దకు చేరడంతో ఆయన స్పందించాడు. ' ఈ వీడియో చూసి నా గుండె తరుక్కుపోయింది. నా తెలుగు సినిమా మాస్ షూటింగ్ సమయంలో నేను అతన్ని కలిశాను. నేను అతనిని స్కూల్లో చేర్పించాను, కానీ ఒక సంవత్సరం తర్వాత, అతను వెళ్ళిపోయాడని, కనిపించకుండా పోయాడని విన్నాను. నేను అతని కోసం వెతకడానికి ప్రయత్నించాను కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇప్పుడు, చాలా సంవత్సరాల తర్వాత అతన్ని చూడటం నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది. ఇంటర్వ్యూలో, అతను వెళ్ళిపోయినందుకు నేను అతన్నితిడతాను.. కొడతాను అని చెప్పాడు. కానీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను తిట్టను.. కొట్టను. నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. ఒకసారి వచ్చి నన్ను కలవు. నీకోసం నేను ఎదురుచూస్తుంటాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.