Pushpa -2: జాతీయ స్థాయిలో పుష్ప -2 హవా...
ABN , Publish Date - May 23 , 2025 | 07:10 PM
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటూ ఉంటారు. కానీ, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో ఇంట్లో కన్నా మిన్నగా రచ్చనే గెలిచారు. వారిద్దరి 'పుష్ప-2' సినిమా ఇండియాలో అనేక రాష్ట్రాల్లో నంబర్ వన్ గ్రాసర్ గా నిలచింది. అయితే తెలుగునేలపై మాత్రం ఈ మూవీ అగ్రస్థానంలో నిలవక పోవడం గమనార్హం! ఆ ముచ్చట తెలుసుకుందాం.
తెలుగు సినిమాల్లో టాప్ గ్రాసర్స్ అనగానే రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన 'బాహుబలి' (Bahubali) సిరీస్, 'ట్రిపుల్ ఆర్' (RRR) ముందుగా గుర్తుకు వస్తాయి. నిజంగానే సదరు చిత్రాలు తెలుగునేలపై అంత హంగామా సృష్టించాయి. ఇప్పుడు తెలుగునాట టాప్ గ్రాసర్ ఏదంటే రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' అనే చెప్పాలి. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలచింది. ఆ తరువాతే సుకుమార్ రూపొందించిన 'పుష్ప- ద రూల్' (Pushpa -2) నిలవడం గమనార్హం! కానీ, 'పుష్ప-2' హిందీ డబ్బింగ్ ఉత్తరాదిన ఉరకలేసింది. తెలుగునాట మాత్రం 'ట్రిపుల్ ఆర్'దే పైచేయి.
ఏడు రాష్ట్రాల్లో 'పుష్ప-2' పైచేయి!
స్వరాష్ట్రంలో 'ట్రిపుల్ ఆర్'ను దాటలేకపోయిన 'పుష్ప-2' హిందీ అనువాద రూపంలో ఉత్తరాదివారిని విశేషంగా ఆకట్టుకుంది. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలలో 'పుష్ప-ద రూల్' హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం! బీహార్, చత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 'పుష్ప-2' హిందీ వర్షన్ ఊపేసింది... ఆ తీరున చూస్తే టోటల్ గా 'ట్రిపుల్ ఆర్'ను దాటేసింది. అందువల్లే ఆల్ ఇండియా టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానంలో నిలచింది 'పుష్ప-2'. దీని కంటే ముందు స్థానాల్లో హిందీ సినిమా 'దంగల్' (Dangal), తెలుగు చిత్రం 'బాహుబలి- ద కంక్లూజన్' ఉన్నాయి. ఏది ఏమైనా ఏడు రాష్ట్రాల్లో టాప్ గ్రాసర్ గా నిలచిన ఏకైక చిత్రంగా 'పుష్ప- ద రూల్' ఉండడం విశేషం!
'పుష్ప-2' సినిమా ఏడు రాష్ట్రాల్లో తన ఆధిపత్యం చాటుకోగా, తరువాతి స్థానంలో 'జవాన్' (Jawan) నిలచింది. షారుఖ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందడం విశేషం. కాగా, 'జవాన్' అస్సామ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో టాప్ గ్రాసర్ గా నిలచింది. తరువాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో 'స్త్రీ -2' అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా వెలుగుతోంది. 'ట్రిపుల్ ఆర్' రెండు తెలుగు రాష్ట్రాల్లో పైచేయిగా ఉంది. కర్ణాటకలో 'కాంతారా', కేరళలో 'తుడరుమ్', తమిళనాడులో 'లియో' (Leo), మహారాష్ట్రలో 'ఛావా' (Chhaawa), పంజాబ్ లో 'గదర్ -2' (Gadar -2), మణిపూర్ లో 'పఠాన్', విచిత్రంగా నాగాలాండ్ లో తెలుగు డబ్బింగ్ 'తండేల్' (Thandel)టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. మిజోరామ్ లో ఈ నాటికీ 'బాహుబలి-2' టాప్ గ్రాసర్ గా నిలవగా, త్రిపురలో ఇప్పటికీ 'దంగల్' నంబర్ వన్ గ్రాసర్ గా ఉంది... కాగా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, సిక్కిమ్ వంటి రాష్ట్రాలలో ఏ సినిమా అత్యధిక వసూళ్ళు చూసిందో సమాచారం లేదు... ఏది ఏమైనా దేశంలోని 25 రాష్ట్రాలలో ఏడింట 'పుష్ప -2' చేసిన హంగామా ఈ నాటికీ చర్చనీయాంశంగానే ఉంది... మరి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏదవుతుందో చూడాలి.
Also Read: Kajal Choudhary: వరుసగా అవకాశాలు
Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 లక్షలు... చిక్కుల్లో డ్రాగన్ బ్యూటీ... లిక్కర్ స్కాంలో పేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి