Jai Balayya: బాలయ్యకు జై కొట్టిన 'సైక్ సిద్ధార్థ'.. జనవరి 1కి షిఫ్ట్
ABN, Publish Date - Dec 10 , 2025 | 08:33 AM
శ్రీనందు నటించి, నిర్మించిన 'సైక్ సిద్ధార్థ్' మూవీ డిసెంబర్ 12 నుండి జనవరి 1కి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఫన్నీ వీడియో రూపంలో శ్రీనందు, రానా దగ్గుబాటి తెలిపారు.
నటుడు శ్రీనందు (Shree Nandu) నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'సైక్ సిద్ధార్థ' (Psych Siddhartha). ఈ సినిమా నచ్చి దీన్ని అవుట్ రేట్ కు తీసుకుని విడుదల చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు రానా దగ్గుబాటి (Rana Daggubati). డిసెంబర్ 12న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని ఇప్పటికే ప్రకటించారు. దానికి తగ్గట్టుగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. అయితే బాలకృష్ణ (Balakrishna) 'అఖండ 2' (Akhanda -2)డిసెంబర్ 5 నుండి 12కి వాయిదా పడటంతో ఇప్పుడు ఈ స్లాట్ లో విడుదల కావాల్సిన చాలా సినిమాలు వేరే డేట్ ను వెతుక్కుంటున్నాయి. కానీ అవేవీ తమ చిత్రాల కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. కానీ 'సైక్ సిద్ధార్థ' నిర్మాతలు మాత్రం తమ సినిమాను జనవరి 1న విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సినిమా నిర్మాత నందు, పంపిణీదారుడు రానా కలిసి... బాలకృష్ణ 'అఖండ 2' వస్తున్న నేపథ్యంలో బాలయ్యకు జై కొడుతూ... ఆయనకు దారి వదిలి తాము జనవరి 1కి వెళుతున్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి జనవరి 1న 'అల్లరి' నరేష్ నటిస్తున్న 'ఆల్కహాల్' మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు రిలీజ్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. సో... 12న విడుదల కాని చాలా సినిమాలను జనవరి 1నే రిలీజ్ చేసే ఆస్కారం ఉందని అంటున్నారు.
'సైక్ సిద్ధార్థ' మూవీని వరుణ్ రెడ్డి (Varun Reddy) డైరెక్ట్ చేయగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. ఇతర ప్రధాన పాత్రలను ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక పోషించారు. శ్రీనందుతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి తుడి దీనిని నిర్మించాడు.