Art Mafia: అగ్గిరాజేస్తున్న టి.జి. విశ్వప్రసాద్ వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:34 PM
టాలీవుడ్ లో జరుగుతున్న సమ్మె మూవీ ట్వీస్టులను తలపిస్తోంది. వేతనాల పెంపు విషయంలో కార్మికులు పట్టు వదలడం లేదు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ కార్యవర్గం చర్చోపచర్చలు జరుపుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారిపోయాయి.
టాలీవుడ్ సమ్మె బాట పట్టి పది రోజులు అవుతోంది. న్యాయపరమైన డిమాండ్స్ కోసం కార్మికులు పనులను మానేసి సమ్మెకు దిగితే... నిర్మాతలు మాత్రం వారి కోరికలను న్యాయపరంగా లేవని చెబుతున్నారు. 30 శాతం వేతనాలు పెంచేవరకు షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తేల్చి చెబుతున్నారు కార్మికులు. ఈ సమస్య ఇలా కొనసాగుతున్న సమయంలోనే పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్స్ పై ఆయన చేసిన కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు.
సమ్మె విరమణకు సంబంధించిన చర్చలు ఓ పక్క రోజు రోజుకూ జటిలంగా మారుతున్న సమయంలనే సినీ ఆర్ట్ డైరెక్టర్స్ ను ఆర్ట్ మాఫియా అంటూ టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)) అభివర్ణించడంపై ఆ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. ఓ సినిమా బాగా వచ్చేందుకు ప్రతి కార్మికుడు ప్రాణం పెట్టి పని చేస్తారని... అలాంటి వాళ్ల గురించి నోరు జారడం కరెక్ట్ కాదని వారంటున్నారు.
మద్రాసు నుంచి ఎన్నో ఇబ్బందులకు గురై మన తెలుగు గడ్డ మీద ఒక అంకితభావంతో, నిబద్ధతతో కార్మికులు పనిచేస్తుంటారని, వారిని మాఫియాతో పోల్చడం సబబు కదాని వారు వాపోయారు. ఈ విషయంలో వెంటనే టీజీ విశ్వప్రసాద్ యూనియన్ కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
సినీ పరిశ్రమ ఏర్పడిన తొలినాటి నుండి నేటి వరకు ఎంతో మంది ఆర్ట్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని, వారి పనితనాన్ని కూడా విశ్వప్రసాద్ విమర్శించినట్టే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఏ సినిమాకైనా ఆర్డ్ డిపార్ట్ మెంట్ సెట్స్ వేస్తుందని, వారి ఆలోచనలో మార్పులకు అనుగుణంగా బడ్జెట్ ఒకోసారి పెరుగుతుంది, మరోసారి తగ్గుతుంటుందని, దానిని దృష్టిలో పెట్టుకోకుండా విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని వారు అన్నారు. సెట్ నిర్మాణంలో గతంలో లేనటువంటి కాంట్రాక్ట్స్ వ్యవస్థను ప్రోత్సహించడంవల్ల, వారి అవగాహన లోపాలవల్ల నష్టాలు జరుగుతున్నాయని సదరు నిర్మాత తెలుసుకోవాలని చెప్పారు. విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆర్ట్ డైరెక్టర్స్ యూనియన్ చేసిన ఈ విజ్ఞప్తిని విశ్వప్రసాద్ ఎంతవరకూ పట్టించుకుంటారో చూడాలి.
Read Also: Vijay Antony: కాస్త ఆలస్యంగా 'భద్రకాళి' ఆగమనం
Read Also: Akkineni Venkat: ఆగిపోయిన డైరెక్షన్ డెబ్యూ మూవీ