Dil Raju: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. ఓటీటీలపై కలిసికట్టుగా నిర్ణయం
ABN, Publish Date - May 27 , 2025 | 07:00 PM
గత వారం పదిరోజులుగా థియేటర్ల బంద్ అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
గత వారం పదిరోజులుగా థియేటర్ల బంద్ అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో థియేటర్ల బందను రద్దు చేసుకున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీలో ప్రధాన నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజులు (Dil Raju) మీడియా ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేసిన సంగతి విధితమే. ఈ విషయమై మరోసారి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించి థియేటర్లకు ప్రజల రాకపై తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం ఓ పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు.
ఈ ప్రకటనపై దిల్ రాజు (Dil Raju) తన స్పందనను తెలియజేస్తూ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఓ పత్రిక ప్రకటనను సైతం విడుదల చేశారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయమన్నారు. దీనిని మనమంతా స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారని దిల్ రాజు గుర్తు చేశారు. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలనే అంశంపై కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని తెలియజేయడం మనందరి బాధ్యత అని దిల్ రాజు పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందన్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ.. అని మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతామని స్పష్టం చేశారు.