సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Harihara Veeramallu: ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం

ABN, Publish Date - Jul 20 , 2025 | 04:27 AM

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే...

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే విష్ణువు, శివుడు కలయిక. ఆ రెండు పేర్లు సూచించేలా వీరమల్లు అని పెట్టాము. ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం అవుతుంది’ అని అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. షూటింగ్‌ పూర్తవడానికి బాగా ఆలస్యమవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్‌ విడుదలతో వారి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెబుతున్నా... ‘హరిహర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుంది.

  • సినిమాను మొదట రెండు భాగాలు అని అనుకోలేదు. సినిమా వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన సినిమాలు అలాగే ఉంటాయి. చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే..ఎక్కువ మందికి చేరువవుతుందని భావించాము. అలా చర్చలో కథ విస్తృతి పెరిగింది.

  • ‘ఖుషి, ‘బంగారం’ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకు మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయనను నేను ఎక్కువగా ఇష్టపడతాను.

  • మా అబ్బాయి అని చెప్పడం కాదు గానీ.. జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని సిద్ధం చేశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా ‘ఇండియానా జోన్స్‌’ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు.


ఏపీలో ‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధర పెంపు

14 రోజులు అడిగిన మేకర్స్‌.. పది రోజులకే అనుమతి..

‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు 14 రోజుల పాటు అదనపు రేట్లకు అనుమతించాలని ప్రభుత్వానికి మేకర్స్‌ విన్నవించారు. పరిశీలించి పది రోజుల పాటు పెంపునకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 23 రాత్రి 9.30 గంటలకు సెకండ్‌ షో, 24వేకువ జామున 4గంటలకు బెనిఫిట్‌ షోలకు అనుమతి పెండింగ్‌లో పెట్టింది. పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతోన్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దిగువ తరగతి రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీప్లెక్స్‌ రూ.200 అదనంగా పెంచుకోవడానికి అనుమతి లభించడంతో సినిమా టిక్కెట్ల ధరలు సింగిల్‌ స్ర్కీన్‌లో బాల్కనీ రూ.250, మధ్య తరగతి రూ.150-190, మల్టీప్లెక్స్‌లలో రూ.350దాకా ఉండబోతున్నాయి.

అమరావతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 20 , 2025 | 04:27 AM