Prime Show Vs Prasanth Varma: ర‌చ్చ‌కెక్కిన ప్రశాంత్‌ వర్మ–ప్రైమ్‌షో వివాదం! హ‌నుమాన్‌లో.. నా వాటా నాకు రావాలన్న ప్రశాంత్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:39 AM

టాలీవుడ్‌లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మధ్య చెల‌రేగిన వివాదం అంత‌కంత‌కు రెట్టింపు అవుతోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి పెద్ద వివాదం రేగింది. ‘హను-మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత, దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మరియు నిర్మాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (Prime Show Entertainment) మధ్య తీవ్రమైన ఆరోపణలు, ఉత్త‌ర‌, ప్రత్యుత్తరాలు వెలుగులోకి వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ప్ర‌శాంత్ వ‌ర్మ విష‌యంలో అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స‌మ‌యంలో ప్రైమ్‌షో బ్యాన‌ర్ నిరంజ‌న్ రెడ్డి (Niranjan Reddy) ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ ఆరు పేజీల లేఖ‌ను విడుద‌ల చేసి తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ (Telugu Film Producers Council)కు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్‌ వర్మ త‌మ‌తో ముందుగా చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి మోసపూరిత చర్యలకు పాల్పడి, తమ సంస్థకు రూ.20.57 కోట్ల ఆర్థిక నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది.

విష‌యానికి వ‌స్తే.. 2024లో ‘హనుమాన్‌’ విజయవంతం కావడంతో ప్రశాంత్‌ వర్మ త‌మ బ్యాన‌ర్‌లో మరో నాలుగు సినిమాలు (అధిరా, మహాకాళి, జై హనుమాన్‌, బ్రహ్మ రక్షస్‌, ఆక్టోపస్‌) ప్రైమ్‌షో బ్యానర్‌లో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఇందుకుగాను ముంద‌స్తుగా ప్రైమ్‌షో ఇప్పటివరకు ప్రశాంత్ వర్మకు మొత్తం రూ. 20,57,50,000 (20 కోట్ల 57 లక్షల 50 వేల రూపాయలు) చెల్లించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు త‌మ వ‌ద్ద‌ ఉన్నాయని ప్రైమ్‌షో వివ‌రాలు సైతం వెళ్ల‌డించింది. ఫిబ్రవరి 2022: రూ. 50 లక్షలు (బ్యాంక్ ట్రాన్స్‌ఫర్), ఫిబ్రవరి 2022: రూ. 1 కోటి (నగదు), డిసెంబర్ 2022: రూ. 50 లక్షలు (బ్యాంక్ ట్రాన్స్‌ఫర్), ఫిబ్రవరి-ఏప్రిల్ 2024: రూ. 8.02 కోట్లు (బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ & నగదు) ఇవన్నీ డైరెక్టర్ సర్వీసెస్ అడ్వాన్స్ పేరుతో చెల్లించినవే అయినప్పటికీ, ప్రశాంత్ వర్మ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒప్పందం ఉల్లంగించిన వారిపై సివిల్ & క్రిమినల్ కేసులు దాఖలు చేసే హక్కు ప్రైమ్‌షో కు ఉందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అయితే.. త‌మ వ‌ద్ద డ‌బ్బు తీసుకున్న‌ ప్రశాంత్ వర్మ ఒప్పందం ప్రకారం మా బ్యాన‌ర్‌లో సినిమా చేయకుండా ఇతర నిర్మాణ సంస్థలతో (RKD స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్, హాంబలే ఫిల్మ్స్) ల‌తో సినిమాలు ప్ర‌క‌టించ‌డం అన్యాయమని ఆ ఐదు సినిమాల Loss Of Business Opportunities కింద రూ.200 కోట్ల నష్టపరిహారం చెల్లించాల‌ని కోరుతూ ప్రైమ్‌షో ఆరోపించింది. వాటిలో అధిరా: టీజర్ రిలీజ్ (23.03.2022) తర్వాత షూటింగ్ ప్రారంభం కాలేదని, దర్శకుడిగా విజయ్ బిన్నీని ప్రకటించి ప్రైమ్‌షోను అవమానించారని, అదేవిధంగా మహాకాళి చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరును దర్శకురాలిగా ప్రకటించి 40 రోజుల షూటింగ్ పూర్తి చేయలేద‌ని, ఇక మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి హను-మాన్ సీక్వెల్‌గా జై హనుమాన్ ప్రకటించారని ఇది ప్రైమ్‌షోకు ఫస్ట్ రిఫ్యూజల్ హక్కు ఉల్లంఘన అన్నారు.

ఇవేగాక రూ.10.23 కోట్లు ఖర్చుపెట్టించి వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న Octopusను కొనిపించారని, అయితే ఆ సినిమా షూటింగ్ ఆరంభం కాలేదని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇప్పించడం లేదని, బ్రహ్మ రక్షస్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన లేదు కానీ హాంబలే ఫిల్మ్స్‌తో చర్చలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం ఉంద‌ని ఇలా.. మా డబ్బుతోనే ఇతర నిర్మాతలతో సినిమాలు తీస్తున్నారు. ఇది మోసం కాదా? అని ప్రైమ్‌షో ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఇచ్చిన‌ రూ. 20.57 కోట్లను 36% వడ్డీతో (చెల్లింపు తేదీ నుంచి రియలైజేషన్ వరకు) క‌లిపి తిరిగి చెల్లిచాల‌ని, రూ. 200 కోట్ల నష్టపరిహారం (వ్యాపార నష్టాలు, లాభాలు, మానసిక ఒత్తిడి). RKD స్టూడియోస్, మైత్రి, హాంబలే ఫిల్మ్స్‌తో జ‌రిగే సినిమాల‌ షూటింగులు నిలిపివేయాలని ప్రైమ్‌షో డిమాండ్లు పెట్టింది.

hanuman.jpg


ప్రశాంత్‌ వర్మ.. ఘాటు రిప్తై

ఇదిలాఉంటే.. ఈ ఆరోపణలపై ప్రశాంత్‌ వర్మ ఘాటుగా స్పందించారు. తాను ఆ సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదని, అగ్రిమెంట్లు కూడా లేవని తనపై చేసిన ఫిర్యాదు “అబద్ధాలు, కల్పితాలు” అని ఖండించారు. ఈ మేర‌కు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు 27.10.2025 తేదీతో లేఖ రాశారు. ప్రశాంత్ వర్మ సైతం కీలక ఆరోపణలు చేశారు. తాను ప్రైమ్‌షోతో చేసిన ఒప్పందం ‘హనుమాన్‌’ సినిమాకే పరిమితమని, మిగతా సినిమాల విషయంలో ఎటువంటి ఒప్పందం లేదని తెలిపారు. అదే సమయంలో ప్రైమ్‌షో పేర్కొన్న రూ.20.57 కోట్లు కాకుండా, తాను కేవలం రూ.8.82 కోట్లు మాత్రమే తీసుకున్నానని, అది కూడా హక్కులకు గానని వివరించారు. కేవ‌లం హ‌ను మాన్ సినిమాకు మాత్ర‌మే ఒప్పందం చేసుకున్నామ‌ని నాలుగు సినిమాలకు కాద‌ని, ‘జై హనుమాన్‌’పై మైత్రి మూవీ మేకర్స్‌తో ఉన్న ఒప్పందం చట్టబద్ధమని, ఫస్ట్ రిఫ్యూజల్ లేద‌ని ప్రైమ్‌షోకు ఆ సినిమాపై ఎలాంటి హక్కులు లేవని చెప్పారు. నిరంజన్‌ రెడ్డి బకాయిలు ఇవ్వకుండా నాపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, ఆయ‌న ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ళ్ల మిగ‌తా సినిమాలు ఆల‌స్యం అయ్యాయ‌ని అన్నారు. నేను నా హక్కుల కోసం పోరాడుతానని, చ‌ట్ట ప‌రంగానే ముందుకు వెళ్తాన‌ని ప్రశాంత్‌ వర్మ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రశాంత్ వర్మ కీలక ఆరోపణలు..

05.06.2021న‌ హను-మాన్ సినిమా కోసం మాత్రమే ఒప్పందం చేసుకున్నామ‌ని, 26.10.2022లోనే హను-మాన్ సినిమా అన్‌రెస్ట్రిక్టెడ్ ఎడిటింగ్ హక్కులు, సిండికేషన్ హక్కులు ఇచ్చారని, 18.03.2023లో నిరంజన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు చెప్పి, హక్కులు తిరిగి తీసుకోవడానికి బలవంతం చేశారని, 4.04.2023లో RK దుగ్గల్ స్టూడియోస్‌తో ఒప్పందం చేసుకుని: హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, చైనీస్ థియేట్రికల్ హక్కులు నిరంజన్ రెడ్డికి ఇచ్చి 50:50 లాభాలు పంచుకోవాలని ఒప్పందం జ‌రిగిన‌ట్లు తెలిపారు. ఇక చెల్లింపుల విష‌యంలో.. 2022లో అధిరా సినిమా టీజర్ దర్శకత్వం కోసం రూ. 1 కోటి మాత్రమే చెల్లించారని ప్రైమ్‌షో చెప్పినట్లు రూ. 2 కోట్లు కాదన్నారు. ఫిబ్రవరి-ఏప్రిల్ 2024లో: హను-మాన్ విజయం తర్వాత హక్కుల కోసం రూ. 7.82 కోట్లు చెల్లించారని మొత్తంగా కేవ‌లం రూ. 8.82 కోట్లు మాత్రమే ఇచ్చార‌ని, నాకు వ‌చ్చిన డ‌బ్బు కూడా అడ్వాన్స్ కాదని హనుమాన్‌లో తన షేర్ అని తెలిపారు.

అంతేగాక.. అధిరా టీజర్ నేనే దర్శకత్వం చేశాన‌ని, RRR థియేట్రికల్ రిలీజ్‌కు ముందు టీజర్ రిలీజ్ చేయమని వారి ప్రమోషన్ కోసం నా పేరుతో ల‌బ్ధి పొందాల‌ని, బ్యానర్ ప్రమోట్ చేయాలని నిరంజన్ రెడ్డి బలవంతం చేశారన్నారు. ఇక మహాకాళి, జై హనుమాన్, ఆక్టోపస్ సినిమాల‌తో వారితో ఏ ఒప్పందం లేదని, ఏ అడ్వాన్స్ లేదని అన్నారు. Octopus విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలని.. ప్రైమ్‌షో చెప్పినట్లు రూ. 2.5 లక్షలు, రూ. 15 లక్షలు చెల్లింపులు అంతా అబద్ధమ‌ని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మే 2024 నుంచి బకాయిలు చెల్లించాల‌ని నిరంజన్ రెడ్డిని కోరుతున్నానని, అలాగే రూ. 295 కోట్లు వసూలు చేసిన హను-మాన్‌లో 50:50 లాభాలు పంచుకోవాలని ప్రశాంత్ వర్మ డిమాండ్ చేశాడు. హనుమాన్ నుండి తనకు ఇంకా చాలా రావాలని నిరంజన్ రెడ్డి ఆ బకాయిలు ఇవ్వకుండా లాభాలు పంచ‌కుండా ఇలాంటి ఫిర్యాదుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. హనుమాన్ లో నా వాటా ఎగ్గొట్టి. డార్లింగ్ (Darling), సంబ‌రాల ఏటిగ‌ట్టు (Sambarala Yeti Gattu (SYG),బిల్లా రంగా భాషా (Billa Ranga Basha) సినిమాలకు డైవర్ట్ చేశార‌ని పేర్కొన్నారు.

ప్రశాంత్ వర్మపై ప్రైమ్‌షో బ్యాన‌ర్ చేసిన ఆరోప‌ణ‌లు పెద్ద చ‌ర్చ‌కు దారి తీయ‌గా టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక ప్రైమ్‌షో ఫిర్యాదు, ప్రశాంత్‌ వర్మ లేఖల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (TFPC) మరియు తెలుగు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ విచారణ ప్రారంభించాయి. ఇరువురి మధ్య చట్టపరమైన పోరాటం తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మ‌రోవైపు.. గ‌త జ‌న‌వ‌రి సంక్రాంతికి విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టి క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించిన ‘హనుమాన్‌’ లాభాల్లో ఎవరికీ ఎంత హక్కు ఉంటుందనే ప్రశ్నపై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఈ వివాదం మున్ముందు ఎక్క‌డ‌కు దారితీస్తుందో చూడాలి.

Updated Date - Nov 02 , 2025 | 11:40 AM