Prasanth Varma: టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు..
ABN, Publish Date - Nov 02 , 2025 | 07:56 PM
దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నిరంజన్ రెడ్డితో వివాదం జరుగుతోన్న సంగతి తెల్సిందే. ఇద్దరు లేఖలు విడుదల చేసి పంచాయతీ పెద్దది చేశారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth varma), ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నిరంజన్ రెడ్డితో వివాదం జరుగుతోన్న సంగతి తెల్సిందే. ఇద్దరు లేఖలు విడుదల చేసి పంచాయతీ పెద్దది చేశారు. తాజాగా ప్రశాంత్ వర్మ మరో లెటర్ తో వివరణ ఇచ్చారు. న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, అవాస్తవాలని అన్నారు. వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రకటన విడుదల చేశారు. ‘హను-మాన్’ సినిమా తర్వాత తమకు ‘అధీర’, ‘మహాకాళీ’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మరాక్షస’ ప్రాజెక్ట్స్ చేస్తానంటూ ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని ఛాంబర్‌లో నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ విధంగా స్పందించాల్సి వస్తోందని ప్రశాంత్ వర్మ అన్నారు. ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారమవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన, ఆధారాలు లేని వార్తలను ఖండిస్తున్నా. నాకు, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న సమస్య ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అంతేకాదు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యవస్థల వద్దకు వెళ్లిన తర్వాత పూర్తిగా విచారణ జరిపి, నిర్ణయం తీసుకుంటాయి. అప్పటివరకూ దీనిపై మీడియా, సోషల్ మీడియా పెద్దది చేసి వివాదాలు సృష్టించవద్దు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలు. మీడియా, డిజిటల్ మీడియాకు, ఛానల్స్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. అసంపూర్ణమైన వార్తలను ప్రచురించవద్దు’ అని ప్రశాంత్ వర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.