Movie Rulez: రిలీజైన గంటల్లోనే.. ఆన్ లైన్లోకి కొత్త సినిమాలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:33 PM

పైరసీ మాఫియా పదితలల రావణుడిలా మారింది. ఒక తల నరికే కొద్ది మరో తల పుట్టుకొచ్చినట్టు ఎన్ని సైట్లు బ్లాక్ చేసినా పైరసీ ఆగడం లేదు. ఎప్పటిలానే సినిమా రిలీజైన గంటల్లోనే అది ఆన్ లైన్లోకి వస్తుండటంతో నిర్మాతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

Movie Rulez

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారిన ఐబొమ్మ వెబ్‌సైట్ ఆపరేటర్ ఇమ్మడి రవి అరెస్ట్‌తో అందరూ కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. 5 మిలియన్లకు పైగా యూజర్లు, 21 వేలకు పైగా పైరేటెడ్ సినిమాలు, 110 డొమైన్లతో నడిచిన ఈ రాకెట్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

స్వయంగా అతనితోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీల వెబ్ సైట్లను క్లోజ్ చేయడంతో పెద్ద సమస్య తీరిపోయినట్టుగా అంతా భావించారు. కానీ అసలు సమస్య ఇంకా ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంది.


పైరసీ చిత్రాలకు కేరాఫ్ గా నిలుస్తున్న ‘మూవీ రూల్జ్’ సైట్ మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూనే ఉంది. కొత్త సినిమాలను వెంటనే లీక్ చేస్తూ ఇండస్ట్రీని భయపెట్టిస్తోంది. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన తాజా సినిమాలు కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా మూవీ రూల్జ్‌లో హై-క్వాలిటీ ప్రింట్స్ గా అప్‌లోడ్ అయ్యాయి. దీంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు.

పోలీసులు డొమైన్‌లను బ్లాక్ చేస్తుంటే, వీరు నిమిషాల్లో కొత్త ఎక్స్‌టెన్షన్లు, మిర్రర్ సైట్‌లతో తిరుగుబాటు చేస్తున్నారు. ఒక లింక్ పోతే పది కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వెబ్‌సైట్స్ మాత్రమే కాదు, టెలిగ్రామ్ గ్రూపులు, ప్రైవేట్ చానెల్స్‌ కూడా పైరసీ హబ్‌గా మారాయి. అక్కడ వి.పి.ఎన్. ద్వారా యాక్సెస్ ఇచ్చి, పోలీసుల కళ్ల నుంచి తప్పించుకుంటున్నారు.

ఈ టెక్నాలజీ వార్‌లో పైరేటర్లే ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీరి మూలంగా థియేటర్ కలెక్షన్లు పడిపోతూ, కోట్లాది పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. మూవీ రూల్జ్ లాంటి పెద్ద చేపలను పట్టుకుంటేనే టాలీవుడ్‌కు నిజమైన విముక్తి లభిస్తుందని సినీవర్గం భావిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Read Also: Peddi: సరికొత్త రికార్డ్ సృష్టించిన చికిరి చికిరి.. అది కదా చరణ్ రేంజ్

Read Also: Pawan Kalyan: ధర్మేంద్ర మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

Updated Date - Nov 24 , 2025 | 06:59 PM