Piracy Gang Busted: పైరసీ ముఠా గుట్టురట్టు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 08:10 PM
టాలీవుడ్‌ను (Tollywood) పట్టి పీడిస్తున్న సమస్యలో పైరసీ (Piracy issue) పెనుభూతం ఒకటి. కొన్నేళ్లగా ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. పరిశ్రమలో ఉన్న సమస్యల్లో కొన్ని కనుమరుగవుతున్నా.. పైరసీను మాత్రం ఎవరూ అరికట్టలేక పోతున్నారు.
టాలీవుడ్‌ను (Tollywood) పట్టి పీడిస్తున్న సమస్యలో పైరసీ (Piracy issue) పెనుభూతం ఒకటి. కొన్నేళ్లగా ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. పరిశ్రమలో ఉన్న సమస్యల్లో కొన్ని కనుమరుగవుతున్నా.. పైరసీను మాత్రం ఎవరూ అరికట్టలేక పోతున్నారు. విడుదలైన గంటలోనే హెచ్‌డీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్లకు అరికట్టడం ఎవరితరం కావడం లేదు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ సైబర్ క్రేౖమ్ పోలీసులు పైరసీపై ఉక్కుపాదం మోపారు. దేశంలోనే పెద్దగా విస్తరించిన ఓ పైరసీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన ఆరుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తెలుగు, హిందీ, తమిళం సహా అనేక భాషల్లో సినిమాలను విడుదల రోజే థియేటర్‌లలో రికార్డ్ చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ పైరసీ వల్ల ఇండస్ర్టీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘ఈ పైరసీ గ్యాంగ్ కొన్నేళ్లగా యాక్టివ్‌గా ఉంది. ఈ ముఠా సీక్రెట్‌గా థియేటర్లలో హిడెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్ తదితర మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాల వారే. వారి నుంచి ల్యాప్‌టాప్స్, హార్డ్ డిస్కులు, ఇంటర్‌నెట్ డివైజ్‌లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. గత 18 నెలల్లో ఈ నెట్‌వర్క్‌లో 40కి పైగా తెలుగు సినిమాలను లీక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘థియేటర్‌లో రిలీజ్ కాగానే అవి అక్రమ వెబ్ సైట్లలోకి స్ట్రీమ్ అయ్యేవనీ, ఈ ముఠా అంతర్జాతీయ పైరసీ ఫ్లాట్‌ఫాంతో ‘1TamilMV’ వెబ్‌సైట్లతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. వారి క్రిప్టో వాలెట్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసి లొకేషన్‌ను ట్రేస్ చేసినట్లు చెప్పారు. (Piracy gang bust)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అలాగే, ‘హ్యాష్ ట్యాగ్ సింగిల్’ సినిమా పైరసీపైనా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారించగా.. ఈ పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ దేశాల్లో గుర్తించారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసి ఏజెంట్లకు రికార్డ్ కెమెరాలు అందజేసి రహస్యంగా ఎలా రికార్డ్ చేయాలో నేర్పిస్తున్నారు. అలాగే, వారికి టికెట్స్ బుక్ చేసి థియేటర్లలోనూ రికార్డు చేయిస్తున్నారు. చొక్కా జేబులు, పాప్ కార్న్ డబ్బా, కోక్ టిన్స్‌లో కెమెరాలు అమర్చి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. ఏజెంట్లకు కూడా క్రిప్టో కరెన్సీ రూపంలోనే కమీషన్ అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ ముఠా అరెస్ట్ కావడం సినీ పరిశ్రమకు శుభవార్త అనే చెప్పాలి. ‘2024లోనే పైరసీ వల్ల రూ.3,500 కోట్లు నష్టపోయాం. ఈ ముఠా సౌత్ ఇండియన్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది.’ అని చాంబర్ ప్రతినిధి అన్నారు. ఇలాంటి వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిందితులకు ఏడేళ్ల జైలు, జరిమానా తప్పవని అన్నారు.