Pawan Kalyan,OG: హోదాను పక్కనపెట్టి.. అభిమానుల్లో ఒకడిగా
ABN, Publish Date - Sep 22 , 2025 | 10:37 AM
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులను అలరించారు. సినిమాలోని గెటప్పుతో హాజరై, లైవ్‌లో పాట పాడి, డైలాగ్స్ చెబుతూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు.
తెరపైన తనదైన శైలి నటనతో విజృంభించి అభిమానులను అలరించిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓజీ వేడుక (OGConcert) లో తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. పబ్లిక్ ఫంక్షన్లలో ప్రసంగానికి మాత్రమే పరిమితమయ్యే ఆయన తన సహజ శైలికి భిన్నంగా అభిమానుల్లో ఒకరైపోయారు. డిప్యూటీ సీఎం హోదాను పక్కనపెట్టి వారితో కలసిపోయారు. తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. ‘ఓజీ’ చిత్రంలోని ఓజాస్ గంభీర పాత్రను అభిమానుల ముందు అభినయించి ఆకట్టుకున్నారు.
అంతేకాకుండా తను స్వయంగా అభిమానులతో గొంతు కలిపి ఓజీ సినిమాలోని డైలాగ్స్ చెబుతూ వారిని ఉత్సాహ పరిచారు. సినిమాలోని గెటప్పుతో హాజరవడమే కాదు ‘వాషి యో వాషి’ అనే పాటను లైవ్ లో పాడి అలరించారు. పవన్ కల్యాణ్ నుంచి అలాంటి స్పందన ఊహించని అభిమానులు ఓ వైపు జోరు వర్షం కురుస్తున్నా కదలకుండా ఉండిపోయారు. వారి నినాదాలు, తమన్ సంగీత ప్రదర్శనతో స్టేడియం మార్మోగింది.
నాకు.. ఏదీ ఊరకే రాలేదు
‘సంజయ్ సాహూకు ఏదీ ఊరక రాలేదు’ అని ‘జల్సా’ చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. అలాగే పవన్ కల్యాణ్‌కు కూడా ఏదీ ఊరకే రాలేదు. నేను సినిమాలు వదలి రాజకీయాల్లోకి వెళ్లినా మీరు (అభిమానులు) మాత్రం నన్ను వదల్లేదు. మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది. ఈ రోజు రాజకీయాల్లో ప్రజల కోసం కొట్లాడుతున్నానంటే మీరిచ్చిన బలంతోనే’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్ శాస్త్రి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘వర్షం మనల్ని ఆపుతుందా? మనల్ని ఏది ఆపింది గనుక ఇప్పటిదాకా, ఒక ఓటమి ఆపిందా?, పరాజయాలు ఆపాయా?. ఈ రోజున నేనొక డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. ఈ స్థాయి వ్యక్తి ఎవరైనా ఇలా కత్తి పట్టుకొని వేదికపైకి రావడం ఊహించగలమా? నేను సినిమా ప్రేమికుణ్ణి. నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు.
నా లైఫ్‌లో ఆడియో ఫంక్షన్లకు ఇలా ఎప్పుడూ రాలేదు. దర్శకుడు సుజీత్ వల్లే ‘ఓజీ’ సినిమాలోని కాస్ట్యూమ్స్‌తో రావాల్సి వచ్చింది. నా అభిమానులైన మీ కోసమే ఇదంతా. ‘ఖుషీ’ సినిమా అప్పుడు మీలో ఉన్న జోష్‌ను మళ్లీ ఈ రోజు చూస్తున్నాను’’ అని అన్నారు. వాషి యో వాషి అనేది ఒక జపనీస్ హైకూ. సుజీత్ తన స్క్రిప్టులో విలన్ పాత్రను ఉద్దేశించి ‘నువ్వు ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకు తీసుకొచ్చి నేలమీద కూర్చుబెడతాను’ అని రాశారు. ఇది నేను పాడాలనుకోలేదు. తమన్ కోరిక మేరకు పాడాను. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ గారితో కలసి పనిచేయడం సంతోషం కలిగించింది. ఆయనో అద్భుతమైన నటుడు.
సుజిత్‌ను త్రివిక్రమ్ పరిచయం చేశారు. అతను చెప్పేది తక్కువ కానీ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది. ఈ సినిమాకు నేను కాదు సుజిత్, తమన్ స్టార్స్. ప్రియాంక అరుల్ మోహన్ గారి పాత్ర హృద్యంగా ఉంటుంది. మంచి ప్రేమకథ మా మధ్య ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ‘ఓజీ’తో మీ ముందుకు వస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, వై రవిశంకర్, నటులు ఇమ్రాన్‌హష్మీ, అర్జున్‌దాస్, శ్రియారెడ్డి, ప్రియాంక అరుల్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.