Pawan Kalyan: కమిషనర్ వి.సి.సజ్జనార్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు
ABN, Publish Date - Nov 17 , 2025 | 02:35 PM
పైరసీని (Piracy) అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు.
పైరసీని (Piracy) అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు.పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కు (VC Sajjanar) అభినందనలు తెలిపారు. ఈ మేరకు అయన ఓ లేఖ విడుదల చేశారు. 'డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించి వేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ (Hyd commissioner) సజ్జనార్ కు అభినందనలు తెలియచేస్తున్నాను' అన్నారు.
అలాగే బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్య పరుస్తున్నారు. ఆయనతో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి' అని పవన్ పేర్కొన్నారు.