Pawan Kalyan: శివశక్తి దత్తా మృతికి ఎ.పి. ఉపముఖ్యమంత్రి సంతాపం
ABN , Publish Date - Jul 08 , 2025 | 10:31 AM
ప్రముఖ సంగీత దర్శకడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి (Keeravani) తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్తా (Sivasakthi Dutta) మృతికి ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం తెలిపారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, 'ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అని తెలిపారు.
ఈ నెల 24న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'కు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశేషం ఏమంటే... చిత్రకారుడు, రచయిత అయిన శివశక్తిదత్తా సోలోగా 'చంద్రహాస్' మూవీని డైరెక్ట్ చేశారు. కానీ అంతకంటే ముందే... 1996లో తన సోదరుడు విజేంద్ర ప్రసాద్ తో కలిసి 'అర్థాంగి' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆనంద్, రవళి ఇందులో జంటగా నటించారు. ముందుగా పాటలు రాసుకుని, కంపోజ్ చేసుకుని, దానికి తగ్గట్టుగా కథను రాసుకున్నట్టు అప్పట్లో వారు తెలిపారు.'అర్థాంగి' మూవీని వసుధా చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
Also Read: Siva Shakthi Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఇకలేరు