Siva Shakthi Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఇకలేరు

ABN , Publish Date - Jul 08 , 2025 | 09:02 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త (92) కన్నుమూశారు.

Siva Shakthi Datta

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (Keeravani) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త (Siva Shakthi Datta-92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. గేయ రచయిత, స్ర్కీన్‌ రైటర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.

శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు, అక్టోబర్‌ 8 1932లో కొవ్వూరులో జన్మించారు. టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి శివశక్తి దత్త పెదనాన్న అవుతారు. కళలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబయిలోని ఓ ఆర్ట్స్‌ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చారు. కమలేశ్‌ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్‌, సితార్‌, హార్మోనియం నేర్చుకున్నారు. నాగార్జున నటించిన 'జానకిరాముడు' చిత్రానికి స్ర్కీన్‌రైటర్‌గా, పని చేసిన ఆయన 2007లో 'చంద్రహాస్‌' చిత్రాన్ని డైరక్ట్‌ చేశారు. గేయ రచయితగా టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్‌ సాంగ్స్‌ ఇచ్చారు.

సై సినిమాల్లో నల్లా నల్లాని కళ్ల’ పాట నుంచి ఛత్రపతి మన్నేల తింటివిరా, రాజన్న అమ్మా అవని గతేడాది వచ్చిన హనుమాన్‌ థీమ్‌ సాంగ్‌ వరకూ ఎన్నో హిట్‌ పాటలకు సాహిత్యం అందించారు. బాహుబలి 1 మమతల తల్లి, ధీవర, బాహుబలి 2 సాహోరే బాహుబలి, ఎన్టీఆర్‌: కథానాయకుడు కథానాయక, ఆర్‌ఆర్‌ఆర్‌ రామం రాఘవమ్‌, హనుమాన్‌ అంజనాద్రి థీమ్‌, పాటలను ఆయనే రాశారు.

శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కల్యాణి మాలిక్‌, శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆయన తమ్ముడు. శివశక్తి దత్త మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. సినీ ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నాం మహా ప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 09:54 AM