Pawan Kalyan: ధర్మేంద్ర మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్
ABN, Publish Date - Nov 24 , 2025 | 03:52 PM
బాలీవుడ్ 'హీ-మ్యాన్'గా పేరొందిన సీనియర్ స్టార్ ధర్మేంద్ర (Dharmendra) మరణం ఇండస్ట్రీ మొత్తాన్ని శోకసంద్రంలోకి మునిగిపోయేలా చేసింది.
Pawan Kalyan: బాలీవుడ్ 'హీ-మ్యాన్'గా పేరొందిన సీనియర్ స్టార్ ధర్మేంద్ర (Dharmendra) మరణం ఇండస్ట్రీ మొత్తాన్ని శోకసంద్రంలోకి మునిగిపోయేలా చేసింది. ధర్మేంద్ర మృతితో ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అయితే నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందినట్లు డియోల్ కుటుంబం అధికారికంగా తెలిపింది.
ఇక ధర్మేంద్ర మృతిపై ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలియజేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ధర్మేంద్ర మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్.. ధర్మేంద్ర మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. 'ప్రముఖ నటులు శ్రీ ధర్మేంద్ర కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అందుకే ఆయన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు.
షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కి బారాత్ లాంటి చిత్రాలతో నటనలో తనదైన శైలి చూపించారు. 2004 నుంచి అయిదేళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. ధర్మేంద్ర గారి కుమారులు శ్రీ సన్నీ డియోల్, శ్రీ బాబి డియోల్, సతీమణి శ్రీమతి హేమమాలినికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.